Just SportsLatest News

Gauge Test : బ్యాట్లను తనిఖీ చేస్తున్న అంపైర్లు…అసలు ఏంటీ గేజ్ టెస్ట్ ?

Gauge Test : టీ20 క్రికెట్ అంటేనే బ్యాటర్ల గేమ్ గా మారిపోయింది. ఎలాంటి బౌలర్ కైనా ఈ ఫార్మాట్ లో చుక్కలు కనిపిస్తున్నాయి

Gauge Test

టీ20 క్రికెట్ అంటేనే బ్యాటర్ల గేమ్ గా మారిపోయింది. ఎలాంటి బౌలర్ కైనా ఈ ఫార్మాట్ లో చుక్కలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లాంటి కమర్షియల్ కమ్ ఎంటర్ టైన్ మెంట్ లీగ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది ? అభిమానులు కూడా సిక్సర్లు, బౌండరీలనే ఆస్వాదిస్తుంటారు.

దీంతో ఆటలో మజా తగ్గిపోతుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆటను సమతూకంగా మార్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా బ్యాటర్లు వాడే బ్యాట్ కొలతలు, బరువు విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో ఈ రూల్స్ ను ఖచ్చితంగా పాటిస్తున్నారు. మ్యాచ్ లో కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు అంపైర్లు బ్యాట్లను తనిఖీ చేస్తుండడాన్ని అందరూ చూస్తున్నారు.

దీనిని గేజ్ టెస్టు(Gauge Test)గా పిలుస్తారు. నిర్దేశిత ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా బ్యాట్లు ఉన్నాయా లేదా అనేది ఈ గేజ్ టెస్ట్(Gauge Test) ద్వారా నిర్ణయిస్తారు. బ్యాటర్లు నిబంధనలకు విరుద్ధంగా చాలా భారీగా లేదా మందంగా ఉండే బ్యాట్లను వాడకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అంపైర్లు త్రిభుజాకారంలో ఉండే ఒక ప్లాస్టిక్ లేదా మెటల్ సాధనాన్ని ఉపయోగించి టెస్ట్ చేస్తారు. దానిని పెట్టినప్పుడు బ్యాట్ ఈ సాధనం గుండా సులభంగా వెళ్లాలి.

లేకుంటే ఆ బ్యాట్ ను మార్చుకోమని సూచిస్తారు.ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాట్ యొక్క కొలతలు చూస్తే వెడల్పు 4.33 అంగుళాలు, మందం 2.68 అంగుళాలుగా ఉండాలి. అలాగే అంచు మందం 1.61 అంగుళాలుగా ఉండాలి. వీటికి మించి ఉంటే మాత్రం ఆ బ్యాట్ వాడేందుకు వీలులేదు. ఐపీఎల్ 2025 సీజన్ నుండి, ఫీల్డ్ అంపైర్లు మైదానంలోనే ఎప్పుడైనా బ్యాట్లను తనిఖీ చేసేలా రూల్స్ ప్రవేశపెట్టారు.

Gauge Test
Gauge Test

బ్యాటర్లకు మరియు బౌలర్లకు మధ్య పోటీ సమతూకంగా ఉండేందుకే ఈ నిబంధనను కఠినతరం చేశారు. బ్యాట్ మందం పెరిగితే బంతి తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. దీనిని నియంత్రించేందుకు నిర్దిష్ట కొలతలు అమలు చేస్తున్నారు. ఎక్కువ మందం ఉన్న బ్యాట్ తో బంతిని పెద్దగా పవర్ లేకుండానే షాట్లు కొట్టొచ్చు.

అలాంటప్పుడు బౌలర్ ఎంతబాగా బౌలింగ్ చేసినా కూడా బ్యాటింగ్ టీమ్ కే అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే ఈ గేజ్ టెస్టును అమలు చేస్తూ బ్యాట్ కూ, బంతికీ మధ్య సమానపోటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

Bengaluru Traffic : 1.2 కోట్లు దాటేసాయి…ట్రాఫిక్ నరకంగా బెంగళూరు

Related Articles

Back to top button