India Alliance
ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక భేటీకి సిద్ధమైంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ న్యూఢిల్లీలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇండియా జన్ బంధన్ పేరుతో జరగబోతున్న ఈ కీలక సమావేశానికి 23 పార్టీలు హాజరవుతున్నాయి. అయితే ఇండియా కూటమిలో(India Alliance) కీలకపార్టీగా ఉన్న డీఎంకే మాత్రం ఈ భేటీకి దూరంగా ఉంటోంది. నిజానికి ఈ సమావేశాన్ని డీఎంకే బహిష్కరించినట్టే భావిస్తున్నారు.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ్ టీవీకేకు మద్దతు పలకడమే దీనికి కారణం. మొన్నటి వరకూ ఇండియా కూటమి(India Alliance)లో బలమైన మిత్రపక్షంగా ఉన్న తమను పక్కన పెట్టి విజయ్ పార్టీతో కాంగ్రెస్ జత కట్టడం డీఏంకేకు అస్సలు నచ్చలేదు. అప్పటి నుంచే స్టాలిన్ సైతం కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు.
విజయ్ పార్టీకి సపోర్ట్ చేయడంతోనే కాంగ్రెస్ తో డీఏంకే విభేదాలు మరింత ముదిరాయి. ఈ కారణంగానే ఇండియా కూటమికి దూరంగా ఉంటూ వస్తున్న డీఏంకే ఇప్పుడు సమావేశాన్నే బహిష్కరించినట్టు చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో డీఏంకే మళ్లీ కాంగ్రెస్ తో జత కట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆ పరిస్థితులకు ఇండియా కూటమి కూడా సిద్ధమైపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కీలక భేటీకి ఆప్ కూడా దూరం పాటిస్తోంది.
మరోవైపు ఈ సమావేశంలో అందరి చూపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపైనే ఉంది. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఇండియా కూటమి నేతలు మమతాకు సంఘీభావం తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏపై పోరాడే విషయంలో దీదీనే ఇండియా కూటమిలో కీలకమన్న విషయం అందరికీ తెలుసు.
మోదీ, అమిత్ షా వంటి నేతలను తన పదునైన ప్రసంగాలతో ఏకిపారేసే ఫైర్ బ్రాండ్ గా మమతకు పేరుంది. అందుకే ఈ కీలక భేటీలో దీదీ చేయబోయే ప్రసంగం పైనే అందరి దృష్టి ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమిష్టిగా పోరాడడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని జైరాం రమేష్ తెలిపారు.
దేశంలో సర్ పేరుతో చేపట్టిన ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని వ్యతిరేకించడం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. రాబోయే 2029 సాధారణ ఎన్నికలకు ఒక బలమైన ఉమ్మడి వ్యూహాన్ని రచించడం ఈ భేటీ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు.
IND vs AFG : పట్టుబిగించిన టీమిండియా..ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ ఎదురీత
