Rahul Gandhi : మద్ధతు ఇచ్చేది లేదన్న రాహుల్.. డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఏం చేయబోతోంది ?
Rahul Gandhi : జనాభా ప్రాతిపదికన సీట్లను పునర్విభజిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Rahul Gandhi
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి అందరి దృష్టీ డీలిమిటేషన్ బిల్లుపైనే ఉంది. గత సమావేశాల్లో మెజార్టీ లేకున్నా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మరోసారి మార్పులు చేసి తీసుకొస్తామంటూ పార్లమెంట్ వేదికగా అమిత్ షా ప్రకటించారు.
ప్రధానంగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు కలిపి ప్రవేశపెట్టొద్దని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాజా సమావేశాల్లో ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు టీఎంసీ, శివసేన, ఆప్ పార్టీల ఎంపీల్లో కొందరిని తమవైపు తిప్పుకుంది.
తాజాగా విపక్షాలతోనూ కేంద్రం చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మద్ధతు కోరింది. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ అంశంపైనే దాదాపు రెండు గంటల పాటు రాహుల్‌తో చర్చించారు. సహజంగానే రాహుల్ కేంద్రం రిక్వెస్టుకు నో చెప్పేశారు. ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదంటూ కిరణ్ రిజిజు చెప్పినా రాహుల్ ససేమిరా అన్నారు. దీనిలో భాగంగా కొన్ని కీలక డిమాండ్లు కూడా రాహుల్(Rahul Gandhi) కేంద్రం ముందు ఉంచారు.
అయోధ్య రామమందిర విరాళాల చోరీ, జంతర్ మంతర్ ధర్నాలో విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో చర్చించాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచీ కాంగ్రెస్‌తో సహా మిగిలిన విపక్షాలు ఇవే అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరికొందరు కేంద్ర మంత్రులు సమాజ్‌వాదీ పార్టీ వంటి ఇతర కీలక ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే విపక్షాలు మాత్రం కొన్ని అంశాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లను పునర్విభజిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకే దీనివల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నది వారి వాదన.
ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రాంతీయ పార్టీలు మండిపడుతున్నాయి. కేంద్రం మాత్రం విపక్షాల వాదనను కొట్టిపారేస్తోంది. ఇక మారిన కొన్ని రాజకీయ సమీకరణాలను సద్వినియోగం చేసుకుని డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం పావులు కదుపుతోంది. దీని కోసం ఆగస్టు 16 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
PM Modi : పీఎం మోదీ ఫేస్‌బుక్ పోస్ట్ డిలీట్ రచ్చ..దిగొచ్చిన జుకర్‌బర్గ్ టీమ్





