Just NationalLatest News

Sonam Wangchuk : చనిపోయినా దెయ్యంగానైనా తిరిగొస్తా..సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలు వారిని కదిలిస్తాయా?

Sonam Wangchuk : ప్రస్తుతం సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సోనమ్ వెయిట్ తగ్గడంతో పాటు రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలు కూడా కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.

Sonam Wangchuk

దేశవ్యాప్తంగా ఎగ్జామ్స్ నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై, మెయిన్‌గా పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక విప్లవకారుడు సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) చేస్తున్న నిరాహార దీక్షకు 20రోజులు దాటింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళన కొనసాగుతోంది

శరీరం రోజురోజుకూ బలహీనపడుతున్నా కూడా తన ఆశయం మాత్రం చెక్కు చెదరలేదని సోనమ్ చెబుతున్నారు . అయితే ఈ నెల జూలై 20వ తేదీన పార్లమెంట్ వరకు తాము తలపెట్టిన శాంతియుత మహా పాదయాత్ర తమకు అత్యంత కీలకమని, ఆ రోజు వరకు తాను ఎలాగైనా ప్రాణాలతో ఉంటానని సోనమ్ అనడం అక్కడివారిని కదిలిస్తోంది.

ఒకవేళ తన ఊపిరి ఆగిపోయినా సరే దెయ్యంగా మారైనా తిరిగి వచ్చి మరీ.. ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని సోనమ్ వాంగ్‌చుక్ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు నిరసనకారుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయి.

మరోవైపు, సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) చేపట్టిన ఈ పోరాటానికి సంఘీభావంగా దీక్షలు చేస్తున్న స్టూడెంట్ లీడర్స్ ఆరోగ్యం కూడా మెల్లగా క్షీణిస్తోంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) రెప్రజెంటేటివ్స్ అయిన నేహా, మనీశ్, అమీన్‌ పరిస్థితి విషమంగా మారుతోందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మెయిన్‌గా డీహైడ్రేషన్ తీవ్రమవడంతో అమీన్ పరిస్థితి సీరియస్ కండిషన్‌కి చేరగా, నేహా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయాయి. మనీశ్ కూడా తన శరీర బరువులో ఏకంగా పది శాతానికి పైగా కోల్పోయారు. అయినా కూడా వీరంతా, కేంద్ర ప్రభుత్వం విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పి తప్పులు సరిదిద్దుకునే వరకు తాము వెనక్కి తగ్గేదే లేదంటూ భీష్మించుకుని కూర్చొన్నారు.

ఈ పరిణామాలతో నిరసన ప్రదేశానికి పొలిటికల్ సపోర్ట్ కూడా పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా దీక్షా స్థలికి చేరుకుని సోనమ్ వాంగ్‌చుక్‌ను పరామర్శించారు. పరీక్షల లీకేజీ వ్యవహారాలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సోనమ్ వెయిట్ తగ్గడంతో పాటు రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలు కూడా కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. బాడీలో నీటిశాతం వేగంగా తగ్గిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఫ్యాట్ నిల్వలు కరిగిపోయి.. కండరాలు క్షీణించే మూడో దశకు ఆయన శరీరం చేరుకుందని, దీనివల్ల అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మద్దతు దారులు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు విద్యార్థుల హక్కుల కోసం తామంతా జూలై 20న చేపట్టబోతున్న పార్లమెంట్ మార్చ్‌ను దిగ్విజయం చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు.

Strong Bones : ఈ 3 నేచురల్ ఫుడ్స్‌తో మీ వయసు రివర్స్ .. ఎముకల్లో కూడా కొండంత బలం..

Related Articles

Back to top button