Just PoliticalJust TelanganaLatest News

TRS : ఈసీ చేతిలో టీఆర్ఎస్ సెంటిమెంట్.. కవిత పార్టీ పేరు మార్పు ఎలాంటి టర్నింగ్‌లు తీసుకోబోతోంది?

TRS : కొత్త పేరుతో సున్నా నుంచి స్టార్ట్ చేయడం కంటే ఇప్పటికే అందరి నోళ్లలో నానిన టీఆర్ఎస్ పేరుతో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్తే భావోద్వేగాలను సులువుగా క్యాష్ చేసుకోవచ్చని కవిత అనుకున్నారు.

TRS

తెలంగాణ పొలిటికల్ రంగస్థలంపై సరికొత్త వివాదం రాజుకుంది. కల్వకుంట్ల కవిత కొద్ది రోజుల క్రితం తమ పార్టీకి ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పేరు మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన అల్టిమేటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది.

నిజానికి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరును తన పార్టీకి పెట్టడానికి బలమైన రాజకీయ వ్యూహంతో పాటు భావోద్వేగ సెంటిమెంట్ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నేతృత్వంలో ఉధృతంగా సాగిన ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అలా దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో ఈ పేరు ముద్రపడింది. అయితే జాతీయ రాజకీయాల కోసం ఆ పార్టీ పేరును టీఆర్ఎస్‌ నుంచి భారత్ రాష్ట్ర సమితి (BRS) గా మార్చిన తర్వాత.. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామీణ ఓటర్లలో అలాగే తెలంగాణ కోసం పోరాడినవారిలో కొంత వెలితి ఉందనే భావన వ్యక్తమైంది.

ఇప్పుడు తండ్రి కేసీఆర్, అన్నయ్య కేటీఆర్‌తో విబేధాలు వచ్చిన కవిత అదే పాత ఉద్యమ సెంటిమెంట్‌ను, ప్రజల్లో ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. కొత్త పేరుతో సున్నా నుంచి స్టార్ట్ చేయడం కంటే ఇప్పటికే అందరి నోళ్లలో నానిన టీఆర్ఎస్ పేరుతో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్తే భావోద్వేగాలను సులువుగా క్యాష్ చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు దీనిపై ఈసీ అభ్యంతరాలు తెలపడంతో.. కాస్త ఆలోచనలో పడినా ఆ పేరును వదిలే ప్రసక్తే లేదని ఆమె గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం.

కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టగానే.. బీఆర్ఎస్ శ్రేణులు దీనిని వ్యతిరేకిస్తూ ఈసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దానికి ప్రధాన కారణం రాజకీయ ఉనికి, ఓట్ల చీలిక భయం. తాము అధికారికంగా పేరు మార్చుకున్నా కూడా, తెలంగాణ ప్రజల మనసుల్లో ఇప్పటికీ తమదే అసలైన టీఆర్ఎస్ అనే భావన పోకూడదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

ఒకవేళ కవితకు టీఆర్‌ఎస్‌(TRS) పేరును కేటాయిస్తే, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు, చదువుకోని ఓటర్లు కవిత పార్టీ పేరు చూసి..కేసీఆర్ పార్టీ అనుకుని పొరపాటున ఓటు వేసే అవకాశం ఉంది. తమ సుదీర్ఘ పొలిటికల్ ప్రస్థానానికి చిహ్నమైన పేరును మరొకరు వాడుకుని, తమ ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందన్న భావన బీఆర్ఎస్‌లో ఉంది. పైగా మహారాష్ట్రకు చెందిన మరో సామాజిక సంస్థ కూడా టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరం తెలపడం బీఆర్ఎస్ వాదనకు మరింత బలాన్నిచ్చింది.

ఏది ఏమయినా ఈ వివాదం కవిత రాజకీయ ప్రయాణాన్ని ఒక కీలక మలుపు తిప్పినట్లే అయింది. ప్రస్తుతానికి ఆమె ముందు మూడు దారులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిలో మొదటిది కవిత తలొగ్గి పేరు మార్చుకోవడమే. ఈసీ ఆదేశాలతో 15 రోజుల్లోగా కొత్త పేర్లను ప్రతిపాదిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. కానీ టీఆర్ఎస్ బ్రాండ్ ద్వారా సాధించాలనుకున్న పొలిటికల్ మైలేజ్ ఆమె కోల్పోతారు.

TRS
TRS

ఇక రెండోది ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించడం. అయితే గతంలో ఇలాంటి పేర్ల వివాదాల్లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలనే ..కోర్టులు సమర్థించిన సందర్భాలు ఎక్కువగా ఉండటంతో ఇది కవితకు మైనస్ అయ్యే అవకాశం ఉంది.

అలాగే ఒకవేళ ఆమె కొత్త పేర్లు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ పేరుకోసమే పట్టుబడితే, దరఖాస్తు పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల పార్టీ స్థాపన ప్రక్రియ మరింత ఆలస్యమై, ఆమె రాజకీయ ప్రణాళికలు దెబ్బతింటాయి. మొత్తంగా కవిత ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆమె ఈసీ సూచించినట్లు వేరే 3 పేర్లను ఇస్తారా లేక న్యాయపోరాటానికి దిగుతారా అనేది తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికరంగా మారనుంది.

Jack Fruit : పనస గింజల్లో దాగున్న పోషకాల సామ్రాజ్యం.. ఆ వ్యాధులకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్

Related Articles

Back to top button