Just SpiritualJust LifestyleLatest News

Kamadahana :హోలీ పండుగకు ముందు కామదహనం ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

Kamadahana :అగ్ని దేవుడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని రక్షించి, దుష్ట ఆలోచనతో ఉన్న హోళికను మాత్రం భస్మం చేసేస్తాడు.

Kamadahana

హోలీ పండుగ వస్తుందంటేనే దేశవ్యాప్తంగా చిన్నా , పెద్ద రంగుల పండుగకు కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోతారు. అయితే హోలీ పండుగకు ముందు రోజు రాత్రి.. ఊరూరా కామదహనం(Kamadahana)కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఈ పండుగ వెనుక రెండు పౌరాణిక కథలు ఉన్నాయని పండితులు చెబుతారు.

దీనిలో మొదటిది భక్త ప్రహ్లాదుని కథ. రాక్షస రాజయిన హిరణ్యకశ్యపుడు తన కుమారుడు ప్రహ్లాదునికి ఉన్న అనంతమైన విష్ణు భక్తిని మాన్పించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు అణువణువునా హరినామ స్మరణనే నింపుకొంటూ నిత్యం గడుపుతాడు.

దీంతో విసిగిపోయిన హిరణ్యకశ్యపుడు తన చెల్లెలయిన హోళిక సహాయం తీసుకుంటాడు. హోళికకు అగ్నిలో దహనం కాకుండా ఉండే వరం ఉండటంతో.. ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేస్తానని..అప్పుడు ప్రహ్లాదుడు అగ్నికి ఆహుతై తాను సురక్షితంగా బయటకు వస్తానని అన్నతో చెబుతుంది.

కానీ అగ్ని దేవుడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని రక్షించి, దుష్ట ఆలోచనతో ఉన్న హోళికను మాత్రం భస్మం చేసేస్తాడు. ఇలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళికా దహనం లేదంటే కామదహనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక శివపురాణంలో మన్మధ దహనానికి సంబంధించి.. మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. తారకాసురుడనే రాక్షసుని అంతం శివపార్వతుల కుమారుడి వల్లే సాధ్యమవుతుందని దేవతలకు తెలుస్తుంది.

Kamadahana
Kamadahana

కానీ ఆ సమయంలో సతీదేవి దేహత్యాగం తర్వాత.. శివుడు కఠోర తపస్సులో నిమగ్నమై ఉండటంతో.. ఆయన మనసును పార్వతీ దేవి వైపు మళ్లించడానికి దేవతలు మన్మధుడిని పంపుతారు. శివుడి తపస్సుకు భంగం కలిగించడానికి మన్మధుడు తన పూల బాణాలను విసరడంతో.. శివుడు ఆగ్రహించి తన త్రినేత్రాన్ని తెరవడంతో మన్మధుడు భస్మమైపోతాడు.

ఇది మనలోని క్షణికమైన కోరికలను అంటే కామాన్ని దహించివేసి జ్ఞాన మార్గంలో నడవాలని ఈ  ఘట్టం మనకు బోధిస్తుంది. అందుకే హోలీ ముందు రోజు రాత్రి మనం కూడా మనలోని చెడు ఆలోచనలన్నిటిని అగ్నికి ఆహుతి ఇచ్చి.. పవిత్రమైన మనసుతో భక్తి మార్గంలో సాగిపోవాలి. కామదహనం(Kamadahana) లో మన ఇంట్లో ఉన్న పాత సామానులన్నిటిని ఆ మంటలో వేసి.. మీ ఇంటిని, మిమ్మల్ని పాజిటివ్ మైండ్‌తో నింపుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button