Hair Tonsuring : ఏడుకొండలవాడి సన్నిధిలో తలనీలాలు.. ఈ నల్ల బంగారం లెక్కలేంటి?
Hair Tonsuring : తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల తలనీలాల సమర్పణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది
Hair Tonsuring
తిరుమల కొండపై అడుగుపెట్టగానే ఎవరికైనా సరే తెలియని అలౌకికమైన ప్రశాంతత, గుండె నిండా భక్తిభావం కలుగుతాయి. అలాంటి ఏడుకొండలవాడి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు.
అయితే తిరుమల యాత్ర అంటే కేవలం స్వామివారి దర్శనం చేసుకుని రావడం మాత్రమే కాదు.. అది భక్తి, సాంప్రదాయం, నమ్మకం, సేవల కలయికగా భక్తులు భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన, మనసుకు హత్తుకునే ఘట్టం తలనీలాల(Hair Tonsuring) సమర్పణగా అనుకుంటారు.
హిందూ సాంప్రదాయంలో జుట్టును ఆ మనిషి అందానికి, అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి జుట్టును వేంకటేశ్వరస్వామికి మొక్కుల ద్వారా సమర్పించి.. భక్తులు తమలోని గర్వాన్ని, కోపాన్ని, ‘నేను’ అనే భావనను వదిలేసి తమ భక్తిని చాటుకుంటారు.
అయితే ఈ తలనీలాల(Hair Tonsuring) మొక్కు చెల్లించుకోవడం వెనుక ఆధ్యాత్మిక అంతరార్థం కూడా ఉంది. కొండపైన ఉండే కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, ఆపై చందనం రాసుకుని స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు భక్తుల్లో కలిగే ఆనందం, తృప్తి మాటల్లో చెప్పలేరు.
కానీ కాలక్రమేణా ఈ భక్తి ఆచారం ప్రపంచంలోనే ఒక అతిపెద్ద వ్యవస్థగా మారిపోయింది. భక్తులు సమర్పించే ఈ తలనీలాలనే ఆటోమొబైల్ లేదా వ్యాపార రంగంలో నల్ల బంగారం అని పిలుస్తారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో సహజమైన మనిషి తలవెంట్రుకలకు విపరీతమైన డిమాండ్ ఉంది.
తాజాగా అందుబాటులోకి వచ్చిన టీటీడీ గణాంకాలు ఈ సంప్రదాయం ఎంత బలంగా కొనసాగుతుందో మరోసారి అందరికీ నిరూపించినట్లు అయింది. 2026 మే నెలలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. వేసవి సెలవులు, ట్రాన్స్‌పోర్ట్ పెరగడం వల్ల భక్తుల రాక బాగా పెరిగింది.
మే 23న ఒక్కరోజే సుమారు 57,580 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక మే 27 వ తేదికి ఈ సంఖ్య ఏకంగా 12,43,063 కి చేరింది. ఈ రెండు, మూడేళ్ల మే నెల గణాంకాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద ఎదుగుదల అని టీటీడీ చెబుతోంది.
ఈ తలనీలాలకు(Hair Tonsuring) అంతర్జాతీయంగా అంత క్రేజ్ ఉండటానికి కారణం జుట్టు నాణ్యతే. ఎలాంటి రసాయనాలు వాడని, సహజమైన నలుపు రంగుతో ఉండే భారతీయుల జుట్టుకు ప్రపంచవ్యాప్తంగా మంచి విలువ ఉంటుంది. ఇక్కడి నుంచి సేకరించిన జుట్టును విదేశాల్లో విగ్గుల తయారీ, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్, మూవీ, థియేటర్ ఆర్టిస్టుల మేకప్ ప్రొడక్టులలో వాడుతుంటారు.
వీటన్నింటికీ మించి, క్యాన్సర్ వంటి కీమోథెరపీ చికిత్సల వల్ల జుట్టు కోల్పోయినవారికి సహజమైన జుట్టుతో విగ్గులు తయారు చేయడానికి ఈ జుట్టు ఎంతో ఉపయోగపడుతుంది. భక్తుల నుంచి సేకరించిన జుట్టును టీటీడీ చాలా పద్ధతిగా.. ఐదు రకాల గ్రేడులుగా వర్గీకరిస్తుంది. 31 ఇంచుల కంటే ఎక్కువ పొడవున్న జుట్టును మొదటి గ్రేడ్‌గా.. ఆ తర్వాత 16 నుంచి 30 ఇంచులు, 10 నుంచి 15 ఇంచులు, అలాగే 5 నుంచి 9 ఇంచుల పొడవున్న వెంట్రుకలను వేర్వేరు గ్రేడులుగా డివైడ్ చేస్తారు.

ఇక ఐదో గ్రేడ్ కిందకు వచ్చే మగవారి జుట్టును కూడా వృధా చేయరు. వీటిని ప్రాసెస్ చేసి వాటి నుంచి ఎల్-సిస్టీన్ అనే అమినో యాసిడ్‌ను తయారు చేస్తారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా బేకరీ ప్రొడక్ట్స్, మందుల తయారీ కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో ముడిసరుకుగా ఉపయోగిస్తారు.
ఇలా జుట్టు గ్రేడింగ్ అంతా పూర్తయిన తర్వాత టీటీడీ ప్రతీ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో ఈ-వేలం (E-Auction) నిర్వహిస్తుంది. ఈ వేలంలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ పోటీ పడుతుంటాయి. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యాలకు, అన్నదానం, ఉచిత వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది.
Tata Tiago : క్రేజీ టాటా టియాగో ప్రైస్ ఎంత, ఫీచర్లు ఏంటి? అట్రాక్ట్ చేస్తున్న 4 క్రేజీ రీజన్స్ ఏంటి?





