Nandi : శివసన్నిధిలో నంది రహస్యాలు..5 రూపాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు

Nandi : శివాలయంలోని నంది కేవలం ఒక విగ్రహం కాదని.. అది మనిషి జీవితంలోని విభిన్న దశలకు, గుణాలకు అద్దం పట్టే ఒక ఆధ్యాత్మిక దిక్సూచి అని పండితులు చెబుతారు.

Nandi

శివాలయంలోకి అడుగు పెట్టగానే మనందరం మొదట నందీశ్వరుడికే నమస్కరిస్తాం. కేవలం ఒక శివయ్య వాహనంగా మాత్రమే కాకుండా, పరమశివుని అంతరంగిక భక్తుడిగా, ధర్మానికి ప్రతీకగా నందీశ్వరుడిని కొలుస్తాం. అయితే, అన్ని శివాలయాల్లోనూ నంది(Nandi) ఒకేలా ఉండడన్న విషయం చాలామంది గమనించరు. ఆగమ శాస్త్రాల ప్రకారం నంది(Nandi)కి 5 విశిష్టమైన రూపాలు ఉన్నాయని.. ఒక్కో రూపం వెనుక ఒక్కో అద్భుతమైన అంతరార్థం దాగి ఉందని కూడా చాలామందికి తెలీదు.

ధర్మ నంది.. ఇది నంది యొక్క అత్యంత సాధారణ, పవిత్రమైన రూపం. సమాజంలో న్యాయం, స్థిరత్వం , సత్యాన్ని ఈ ధర్మ నంది రూపం సూచిస్తుంది. 4 పాదాలపై నిలబడే ధర్మదేవతలా ఈ నంది.. భక్తులకు ధర్మ మార్గంలో ఎలా నడవాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నమ్మిన సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని ధర్మ నందీశ్వరుని విగ్రహం గుర్తు చేస్తుంది.

యోగ నంది.. ఈ రూపంలో నందీశ్వరుడు నిశ్చలంగా, కళ్లు మూసుకుని ధ్యాన ముద్రలో కనిపిస్తాడు. ఇది అంతర్ముఖ ప్రయాణానికి, ఆత్మజ్ఞానానికి సంకేతంగా కనిపిస్తుంది. బాహ్య ప్రపంచంలో ఉన్న అల్లకల్లోలాలకు దూరంగా, మనసును మహాశివునిపై ఎలా లగ్నం చేయాలో ఈ రూపం అందరికీ వివరిస్తుంది. మానసిక ప్రశాంతతను, ధ్యాన శక్తిని కోరుకునే వారికి యోగ నందీశ్వరుడు ఒక గొప్ప ప్రేరణ.

భోగ నంది.. భోగ నంది రూపం లౌకిక సుఖాలు, సంతోషాలు, ఐశ్వర్యానికి ప్రతీకగా చెబుతారు. సంపదను, వైభవాన్ని అనుభవించడం తప్పు కాదని, అయితే వాటన్నింటినీ భగవంతుడి ప్రసాదంగా భావించి అహంకారం లేకుండా జీవించాలని మాత్రమే ఈ రూపం చెబుతుంది. సంసార జీవితంలో ఉంటూనే ఆధ్యాత్మికతను ఎలా కాపాడుకోవాలో భోగ నందీశ్వరుడి ద్వారా తెలుసుకోవచ్చు.

Nandi

వీర నంది.. ఈ రూపంలో నంది ఎంతో గంభీరంగా, పౌరుషంతో కనిపిస్తాడు. ఇది అపరిమితమైన శక్తికి, రక్షణకు, ధైర్యానికి సంకేతం. చెడుపై పోరాడటానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి కావాల్సిన ఆత్మబలాన్ని ఈ రూపం అందిస్తుంది. భక్తులకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడే రక్షకుడిగా వీర నందీశ్వరుడిని కొలుస్తారు.

అధికార నంది.. నంది యొక్క నాయకత్వ రూపమే అధికార నంది అని అంటారు. శివుని ప్రమథ గణాలకు అధిపతిగా, కైలాస ద్వారపాలకుడిగా ఉన్న నందికి గల సర్వాధికారాలను ఈ రూపం ప్రతిబింబిస్తుంది. బాధ్యతలను ఎలా నిర్వహించాలి, క్రమశిక్షణతో కూడిన నాయకత్వాన్ని ఎలా ప్రదర్శించాలో అధికార నంది భక్తులకు నేర్పుతుంది. ఈ రూపం మనుషుల్లో కర్తవ్య నిష్ఠను పెంపొందిస్తుంది. మొత్తంగా శివాలయంలోని నంది కేవలం ఒక విగ్రహం కాదని.. అది మనిషి జీవితంలోని విభిన్న దశలకు, గుణాలకు అద్దం పట్టే ఒక ఆధ్యాత్మిక దిక్సూచి అని పండితులు చెబుతారు.

Elder people : వృద్ధులను బెడ్‌కే పరిమితం చేయొద్దు.. ఈ అతి జాగ్రత్తే వారికి ప్రాణాంతకం కావొచ్చు

Exit mobile version