Just SportsLatest News

Gujarat Titans : చెపాక్ లో చెన్నైకి బిగ్ షాక్..గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ

Gujarat Titans : ఐపీఎల్ 19వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు ఓటములతో డీలా పడిన గుజరాత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నైని చిత్తు చేసింది

Gujarat Titans

ఐపీఎల్ 19వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు ఓటములతో డీలా పడిన గుజరాత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నైని చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్ లో రబాడ , బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ అదరగొట్టారు. దీంతో చెన్నైకి ఐదో ఓటమి తప్పలేదు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ ఆడతాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నా చెన్నై తుది జట్టులో మార్పులు చేయలేదు. బ్యాటింగ్ కు దిగిన చెన్నైని సఫారీ పేసర్ రబాడా బెంబేలెత్తించాడు. సంజూ శాంసన్, ఇంపాక్ట్ ప్లేయర్ ఉర్విల్ పటేల్ ను పెవిలియన్ కు పంపాడు. ఈ క్రమంలోనే సీఎస్కే మరో రెండు వికెట్లు కోల్పోయింది.

సర్ఫరాజ్ ఖాన్(0), బ్రెవిస్(2) కూడా ఫెయిలయ్యారు. దీంతో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆదుకున్నాడు. శివమ్ దూబేతో కలిసి ఐదో వికెట్ కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దూబే 17 బంతుల్లో 22 (3 ఫోర్లు, 1 సిక్సర్ ) ఔటవగా.. తర్వాత కార్తీక్ శర్మ (15), ఓవర్టన్ (18) పరుగులతో పర్వాలేదనిపించాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు చివర్లో భారీ షాట్లతో అలరించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. రుతురాజ్ 60 బంతుల్లో 74 (6 ఫోర్లు, 4 సిక్సర్లు) నాటౌట్ గా నిలిస్తే. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, అర్షద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.

Gujarat Titans
Gujarat Titans

ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 6.2 ఓవర్లలో 58 పరుగులు జోడించారు. గిల్ 23 బంతుల్లో 33 (1 ఫోర్, 3 సిక్సర్లు) పరుగులకు ఔటైనా సాయి సుదర్శన్, బట్లర్ దూకుడుగా ఆడుతూ మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

గత మ్యాచ్ లో సెంచరీ చేసిన సాయి సుదర్శన్ మరోసారి దుమ్మురేపాడు. తన ఫామ్ కొనసాగిస్తూ చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్ జోరుతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 3.2 ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. సాయి సుదర్శన్ 46 బంతుల్లో 87 (4 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేయగా.. బట్లర్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకోగా, చెన్నై ఆరో ప్లేస్ కు పడిపోయింది.

AP : ఏపీలో ఎండల సెగ.. ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

Related Articles

Back to top button