Gujarat Titans vs Rajasthan Royals : రాయల్స్ వర్సెస్ టైటాన్స్…గుజరాత్ గెలుపు బాట పట్టేనా ?
Gujarat Titans vs Rajasthan Royals : ఐపీఎల్ 19వ సీజన్ లో తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ , గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి
Gujarat Titans vs Rajasthan Royals
ఐపీఎల్ 19వ సీజన్ లో తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ , గుజరాత్ టైటాన్స్(Gujarat Titans vs Rajasthan Royals) తలపడబోతున్నాయి. చెన్నైని చిత్తు చేసి ఈ సీజన్ ను ఘనవిజయంతో ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ మరో విజయంపై కన్నేసింది. ఆ జట్టు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీపైనే అందరి చూపు ఉంది.
గత ఏడాది అరంగేట్రంలోనే సంచలన ఇన్నింగ్స్ లతో మెరిసిన వైభవ్ ఈ సీజన్ ను కూడా అద్భుతంగా మొదలుపెట్టాడు. కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యువ బ్యాటర్ ను గుజరాత్ బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది చూడాలి. అలాగే జైశ్వాల్ కూడా ఫామ్ అందుకున్నాడు. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో జురెల్, పరాగ్ , హెట్ మెయిర్ లాంటి హిట్టర్లు రాజస్థాన్ కు బలం. అటు బౌలింగ్ పరంగానూ రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది.
తొలి మ్యాచ్ లో ఆ జట్టు పేసర్లు ఆర్చర్, బర్గర్ చెన్నై బ్యాటర్లను వణికించారు. అలాగే జడేజా లాంటి సీనియర్ ఆల్ రౌండర్ కూడా రాయల్స్ కు అడ్వాంటేజ్. సందీప్ శర్మ, బ్రిజేష్ , రవి బిష్ణోయ్ లతో రాజస్థాన్ బౌలింగ్ బలంగా ఉంది. అయితే బ్యాటింగ్ కు అనుకూలించే అహ్మదాబాద్ స్టేడియంలో వీరు ఎలా రాణిస్తారనేది చూడాలి. విన్నింగ్ కాంబినేషన్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు ఈ సీజన్ ను గుజరాత్ టైటాన్స్(Gujarat Titans vs Rajasthan Royals) ఓటమితో ఆరంభించింది. పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైన గుజరాత్ సీజన్ లో తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. గత మ్యాచ్ లో టాపార్డర్ రాణించినా మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.

బ్యాటింగ్ లో గిల్ , బట్లర్ , సాయిసుదర్శన్ కీలకం కానున్నారు. అలాగే గ్లెన్ ఫిలిప్స్, షారూఖ్ ఖాన్ కూడా అంచనాలకు తగ్గట్టు రాణిస్తే గుజరాత్ సొంతగడ్డపై గెలుపు బాట పట్టొచ్చు. బౌలింగ్ లో రబాడ, సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణలతో పేస్ ఎటాక్ బలంగానే ఉంది. గత మ్యాచ్ లో సిరాజ్ తో పూర్తి ఓవర్లు బౌలింగ్ చేయించడంపై విమర్శలు వచ్చాయి. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసినా గెలిపించలేకపోయాడు.
మిగిలిన బౌలర్లు కూడా గాడిన పడితే గుజరాత్ కు తిరుగుండదు. గత రికార్డుల పరంగా చూస్తే గుజరాత్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 8 మ్యాచ్ లలో తలపడితే ఆరు సార్లు గుజరాత్ గెలిచింది. రాజస్థాన్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా. ఛేజింగ్ జట్టుకే ఎక్కువ విజయావకాశాలు ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ కే మొగ్గుచూపుతుంది.





