Vaibhav Sooryavanshi : థాంక్యూ బుడ్డోడా..హీరో ఆఫ్ ది సీజన్ గా వైభవ్
Vaibhav Sooryavanshi : క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి కంటే బుడ్డోడి బ్యాటింగ్ ఫైనల్లో మిస్ అయ్యామే అన్న నిరాశే చాలా మందిలో కనిపించింది
Vaibhav Sooryavanshi
ఎవడ్రా బుడ్డోడు బుడ్డోడు అంటోంది… ఆ కుర్రాడు బుడ్డోడు కాదు ప్రత్యర్థి బౌలర్ల పాలిట బుల్డోజర్… వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్లకు చుక్కులు చూపించిన మొనగాడు… 15 ఏళ్లకే కమిన్స్ , స్టార్క్ , బుమ్రా , షమీ, రబాడ వంటి స్టార్ పేసర్లను ఉతికారేసిన బేబీ బాస్… అసలు ప్రత్యర్థి జట్లలో చాలా మంది బౌలర్లను నిద్రలో కూడా వెంటాడిన బ్యాటర్ అతనే.. ఈ విషయాన్ని కొందరు పైకి చెప్పకున్నా అది మాత్రం వాస్తవం… ఇంకా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో వైభవ్ ను ఔట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్టే..
ఒకవేళ ఔట్ చేయకుంటే మాత్రం అతని ఊచకోతకు బలవ్వాల్సిందే.. చాలా జట్లు ఈ సీజన్ లోనే ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా రుచి చూసాయి. ప్రత్యర్థి బౌలర్ ఎవరన్నది అనవసరం.. కొడితే సిక్సర్.. లేకుంటే బౌండరీ.. ఇలా సాగింది వైభవ్ విధ్వంసం.. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి కంటే బుడ్డోడి బ్యాటింగ్ ఫైనల్లో మిస్ అయ్యామే అన్న నిరాశే చాలా మందిలో కనిపించింది. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం మీద కోట్ల రూపాయలు కుమ్మరించి అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క స్టార్ బ్యాటర్ నిలకడగా రాణించింది లేదు.
కానీ వైభవ్(Vaibhav Sooryavanshi )మాత్రం దుమ్మురేపేశాడు. సీజన్ ఆద్యంతం పరుగుల వరద పారించాడు. అది కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ లతో తన మీద అంచనాలను మరింత పెంచుకున్నాడు. కొన్ని మ్యాచ్ లలో వైభవ్ ఆడిన షాట్లు అబ్బురపరిచాయి. టీ20 క్రికెట్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో అలరించిన క్రిస్ గేల్, రస్సెల్ వంటి హిట్టర్స్ సైతం వైభవ్ బ్యాటింగ్ కు ఫిదా అయిపోయారు.
గత ఏడాది అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ సెంచరీతో తన స్టామినా ఏంటనేది వరల్డ్ క్రికెట్ కు చెప్పేశాడు. అయితే ఆ జోరు ప్రస్తుత సీజన్ లో కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు చాలా మందిలో కనిపించాయి.
అయితే గత సీజన్ కంటే మరింత రాటుదేలిన ఈ 15 ఏళ్ల కుర్రాడు బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచాడు. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో సచిన్ ను ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా 15 ఏళ్ల కుర్రాడిని ఔట్ చేసేందుకు కిందా మీదా పడుతున్నారు.
ఒకటి కాదు రెండు కాదు మూడేసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారంటే వైభవ్ ఏ రేంజ్ లో ప్రత్యర్థి జట్లను భయపెట్టాడో అర్థమవుతోంది. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ఇన్నింగ్స్ అతని విధ్వంసానికి ఉదాహరణ. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. క్వాలిఫైయర్ 2లో పరిణితి చెందిన బ్యాటర్ గా ఇన్నింగ్స్ ఆడాడు.

పవర్ ప్లేలోనే 2 వికెట్లు పడి ఒత్తిడి నెలకొన్న వేళ తాను కూడా ఇష్టానుసారం హిట్టింగ్ కు పోకుండా ఇన్నింగ్స్ నిలబెట్టాడు. అందుకే వైభవ్(Vaibhav Sooryavanshi )ఐపీఎల్ కెరీర్ లో ఇదే నెమ్మదిగా చేసిన హాఫ్ సెంచరీ. ఓవరాల్ గా ఈ సీజన్ లో వైభవ్ 16 మ్యాచ్ లలో 776 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఏకంగా 237 స్ట్రైక్ రేట్ తో విధ్వంసం సృష్టించాడు.
ఈ సీజన్ లో ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసిన వైభవ్ 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాదాడు. ఫైనల్స్ లో గిల్ ఫెయిలైతే మాత్రం వైభవ్(Vaibhav Sooryavanshi)కే ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది.మొత్తం మీద ఐపీఎల్ 19వ సీజన్ ఛాంపియన్ ఎవరైనా హీరో మాత్రం వైభవ్ సూర్యవంశీనే…





