IND vs WI : ఈడెన్ లో డూ ఆర్ డై..విండీస్ తో భారత్ చావోరేవో
IND vs WI : ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 గ్రూప్ 1లో రెండో సెమీఫైనల్ బెర్త్ ఎవరిదనేది ఆదివారమే తేలబోతోంది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ , భారత్ తలపడబోతున్నాయి
IND vs WI
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 గ్రూప్ 1లో రెండో సెమీఫైనల్ బెర్త్ ఎవరిదనేది ఆదివారమే తేలబోతోంది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ , భారత్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ బెర్త్ దక్కించుకోనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సొంతగడ్డపై భారత జట్టునే ఫేవరెట్ గా చెబుతున్నా టీ20ల్లో వెస్టిండీస్(IND vs WI) ను మరో జట్టుతో పోల్చి చూడలేం.
ఎందుకంటే పొట్టి క్రికెట్ అంటేనే కరేబియన్ క్రికెటర్లకు పూనకం వచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్స్ లో వారిదే హవా. గతంతో పోలిస్తే గేల్ , రస్సెల్ , బ్రావో వంటి స్టార్లు లేకున్నా యువ క్రికెటర్లు చాలా మంది అదరగొడుతున్నారు. అందుకే టీమిండియా విండీస్ ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. తనదైన రోజున కరేబియన్లు ఏ జట్టునైనా మట్టికరిపిస్తారు. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ పరంగా ఫామ్ అందుకుంది. జింబాబ్వేతో మ్యాచ్ లో సంజూ శాంసన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకున్నా పర్వాలేదనిపించాడు.
మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్, హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ ఫామ్ లోకి వచ్చేశారు. దీంతో వీరి నెలకొల్పే భాగస్వామ్యాలపైనే భారత్ భారీస్కోరు ఆధారపడి ఉంటుంది. అంతకుముందు సౌతాఫ్రికా చేతిలో పరాజయానికి సరైన భాగస్వామ్యాలు లేకపోవడమే కారణం. దీంతో విండీస్ పై దీనిని అధిగమిస్తే భారీస్కోరు చేయగలుగుతుంది. తుది జట్టు కూర్పు విషయానికొస్తే మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఓపెనర్లుగా అభిషేక్ , సంజూలనే కొనసాగించడం ఖాయం. సంజూ విండీస్ పై భారీ ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ కోరుకుంటోంది. కాగా
ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని కొన్ని గంటలకే మళ్లీ టీమిండియాతో చేరాడు. అయితే జింబాబ్వేతో మ్యాచ్ కాంబినేషన్ ను మార్చే ఛాన్స్ లేనట్టే. దీంతో ఫినిషర్ రోల్ లో తిలక్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు బౌలింగ్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయి. గత మ్యాచ్ లో మన బౌలింగ్ చెప్పుకోదగినవిధంగా లేదు. నిజం చెప్పాలంటే ఈ టోర్నీలో మన బౌలింగ్ అంచనాలకు తగ్గట్టుగా లేదన్నది అంగీకరించాల్సిందే. పేస్ ఆల్ రౌండర్లు పాండ్యా, దూబే భారీగా పరుగులిచ్చేస్తున్నారు. జింబాబ్వేపై కూడా వీరి బౌలింగ్ తేలిపోయింది. ఇప్పుటు టీ20 హిట్టర్లున్న వెస్టిండీస్ పై వీరు అంచనాలకు తగ్గట్టు రాణించకుంటే కష్టమే.
ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్టిండీస్‌ను 200 పరుగుల లోపే కట్టడి చేస్తేనే విజయంపై ఆశలు పెట్టుకోగలం. మరోవైపు వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ భీకరంగానే కనిపిస్తోంది. బ్రాండన్ కింగ్, షైహోప్, షిమ్రన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పోవెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడే సత్తా ఉన్నవారే. పైగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఈడెన్ గార్డెన్స్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలం. దీంతో పరుగుల వరద పారడం ఖాయం. ఇలాంటి పిచ్ పై విండీస్ హిట్టర్లను ఆపడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో బౌలింగ్ ఖచ్చితంగా అంచనాలకు తగ్గట్టు ఉండాల్సిందే.



