Just SportsLatest News

IND vs ZIM : జింబాబ్వేను చిత్తు చేసిన భారత్..సెమీస్ కు ఇక అడుగే దూరం

IND vs ZIM : జింబాబ్వేను ఓడించిన టీమిండియా సెమీస్ ఆశలను నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ లో భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి.

IND vs ZIM

టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు అడుగుదూరంలో నిలిచింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో దుమ్మురేపింది. బ్యాటింగ్ లో కలిసికట్టుగా రాణించి భారీస్కోరు చేయగా.. బౌలింగ్ లో మాత్రం కాస్త తడబడింది. జింబాబ్వే(IND vs ZIM) ఓపెనర్ బెన్నెట్ చివరి వరకూ పోరాడి మెరుపు ఇన్నింగ్స్ ఆడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. అయితే అసాధ్యమైన టార్గెట్ ను ఛేదించే క్రమంలో జింబాబ్వే ఒకవిధంగా ఆకట్టుకుందనే చెప్పాలి.

మొత్తం మీద జింబాబ్వేను ఓడించిన టీమిండియా సెమీస్ ఆశలను నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ లో భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఎట్టకేలకు సంజూ శాంసన్ తుది జట్టులోకి రాగా రింకూ సింగ్ పై వేటు పడింది. అటు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ రీఎంట్రీ ఇచ్చాడు. గత మ్యాచ్ లలో విఫలమైన ఓపెనర్లు ఈ సారి పర్వాలేదనిపించారు.

తొలి వికెట్ కు సంజూ , అభిషేక్ 48 పరుగులు జోడించారు. సంజూ 24 రన్స్ కే ఔటైనప్పటకీ అభిషేక్ శర్మ మాత్రం తన దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) పరుగులు చేయగా.. చివర్లో హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ విధ్వంసం సృష్టించారు. చెరొక ఎండ్ నుంచీ రెచ్చిపోయారు. పాండ్యా అయితే జింబాబ్వే బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే 50 బాదేశాడు.

IND vs ZIM
IND vs ZIM

అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. అటు తిలక్ వర్మ సైతం చెలరేగిపోయాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీస్కోర్ చేసింది. ఈ ప్రపంచకప్ లో ఇదే అత్యధిక స్కోరు.

257 పరుగుల భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే కూడా ఆకట్టుకుంది. వికెట్లు కోల్పోయినా దూకుడు ఆడింది. ఓపెనర్ బెన్నెట్ మెరుపులు మెరిపించాడు. సికిందర్ రజాతో కలిసి అభిమానులను అలరించాడు. బెన్నెట్ దెబ్బకు శివమ్ దూబే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మధ్యలో స్పిన్నర్లు పుంజుకోవడంతో జింబాబ్వే వరుసగా వికెట్లు పారేసుకుంది. చివరికి జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. బెన్నెట్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ 72 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే రన్ రేట్ తో సంబంధం లేకుండా భారత్ తర్వాతి మ్యాచ్ లో విండీస్ పై గెలిస్తే సెమీస్ చేరుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button