IND vs ZIM : నిలవాలంటే గెలవాల్సిందే..జింబాబ్వేతో కీలక మ్యాచ్
IND vs ZIM : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై టీమిండియా పక్కా గెలవాల్సిందే. ఇలాంటి కీలకమైన మ్యాచ్ లో భారత జట్టులోకి వచ్చేదెవరు? బైటకు వెళ్లేదెవరు..?
IND vs ZIM
టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు ఇప్పుడు డూ ఆర్ డై మ్యాచ్ లు ఆడబోతోంది. సూపర్ 8 స్టేజ్ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై పరాజయం.. టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సెమీస్ లో అడుగుపెట్టాలంటే ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్ లలో భారీ విజయాలు నమోదు చేసి రన్ రేట్ మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సఫారీలపై తక్కువ మార్జిన్ తో ఓడిపోయి ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు.
ఏకంగా 76 పరుగుల తేడాతో పరాజయం పాలవడం రన్ రేట్ ను బాగా దెబ్బకొట్టింది. తాజాగా జింబాబ్వేపై వెస్టిండీస్ సాధించిన భారీ విజయంతో ఇప్పుడు భారత్ సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారిపోయాయి. దీంతో మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ గెలిస్తేనే రేసులో నిలుస్తుంది. కాగా ప్రత్యర్థి జింబాబ్వే అయినా సరే ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ జట్టు గ్రూప్ స్టేజ్ లో ఆసీస్ కు షాకిచ్చిన విషయాన్ని మరిచిపోకూడదు.
అందుకే పూర్తిస్థాయి జట్టుతో అత్యుత్తమంగా రాణించి జింబాబ్వేను(IND vs ZIM) చిత్తుగా ఓడించాల్సిందే. ఈ క్రమంలో తుది జట్టులో మార్పులు జరగడం కూడా ఖాయమైంది. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పిస్తారని భావించినా ఓపెనింగ్ కాంబినేషన్ ను మార్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇషాన్ కిషన్ , అభిషేక్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అయితే వరుసగా విఫలమవుతున్న తిలక్ వర్మను తప్పించి సంజూ శాంసన్ ను తీసుకుంటారని భావిస్తున్నారు. దీంతో సంజూ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగే అవకాశాలున్నాయి.
మిడిలార్డర్ లో తిలక్ తో పాటు సూర్యకుమార్ కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో జింబాబ్వేపై భారత కెప్టెన్ చెలరేగితే తిరుగుండదు. అటు హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే మెరుపులు మెరిపిస్తే భారీస్కోరు ఖాయం. ఇదిలా ఉంటే రింకూ సింగ్ ఆడడంపై సస్పెన్స్ నెలకొంది. తండ్రికి అనారోగ్యం కారణంగా జట్టును వీడిన రింకూ మళ్లీ జట్టుతో చేరాడు. బౌలింగ్ విభాగానికి సంబంధించి వాషింగ్టన్ సుందర్ ను తప్పించనుండగా.. అక్షర్ పటేల్ తుది జట్టులోకి రానున్నాడు. గత మ్యాచ్ లో అక్షర్ ను పక్కన పెట్టడంపై విమర్శలు కూడా వచ్చాయి. అటు పేస్ విభాగంలో బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్ కొనసాగనున్నారు.

మరోవైపు జింబాబ్వే(IND vs ZIM) జట్టుపై ఎటువంటి అంచనాలు లేకపోవడంతో ఒత్తిడి కూడా కనిపించడం లేదు. దీంతో ఆ జట్టు స్వేచ్ఛగా ఆడేందుకు వీలుంటుంది. లీగ్ స్టేజ్ లో కంగారూలకు దిమ్మతిరిగే షాకిచ్చిన జింబాబ్వే సూపర్ 8 చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. సంచలన ప్రదర్శనలతో మాత్రం అదరగొట్టింది. ఇప్పుడు ఇండియాకు కూడా హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి అలసత్వం చూపకుండా జింబాబ్వేను(IND vs ZIM) ఓడించాల్సిందే.
భారత తుది జట్టు (అంచనా) ..
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా. రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, బుమ్రా



