T20 World Cup : భారీ విజయమే లక్ష్యం.. నమీబియాతో భారత్ మ్యాచ్
T20 World Cup : టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు రెండో మ్యాచ్ కు నమీబియాతో తలపడబోతోంది
T20 World Cup
టీ20 ప్రపంచకప్(T20 World Cup )లో భారత జట్టు రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. తొలి మ్యాచ్ యూఎస్ఏపై గెలిచి శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు పసికూన నమీబియాతో తలపడబోతోంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు బ్యాటర్లు పూర్తి ఫామ్ అందుకునేందుకు ఈ మ్యాచ్ మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ఎందుకంటే యూఎస్ఏపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తప్పిస్తే మిగిలిన వారంతా నిరాశపరిచారు. అందుకే నమీబియాపై బ్యాటర్లు సత్తా చాటాలని టీమిండియా మేనేజ్ మెంట్ ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు ముందు ఓపెనర్ అభిషేక్ శర్మ అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.
గత రెండురోజులుగా ఉదర సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ బుధవారం హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని సాయంత్రం డిశ్చార్జ్ కూడా అయ్యాడని తెలుస్తోంది. అయితే తుది జట్టులో అభిషేక్ ను ఆడించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తిలక్ వర్మ తెలిపాడు. నిజానికి అభిషేక్ కోలుకోవడం సందిగ్ధంగా ఉండడంతో సంజూ శాంసన్ ను ఆడించేందుకు భారత్ ప్రిపేరయింది. దీనికి తగ్గట్టే నెట్స్ లో సంజూ, ఇషాన్ చాలా సేపు శ్రమించారు. ఇప్పుడు అభిషేక్ శర్మ కోలుకుంటే మాత్రం సంజూకు ఛాన్స్ లేనట్టే.
మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం ఖాయమైంది. తొలి మ్యాచ్ కు దూరమైన బుమ్రా ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో సిరాజ్ , అర్షదీప్ లలో ఒకరిపై వేటు పడనుంది. అటు వాషింగ్టన్ సుందర్ కూడా పూర్తిగా కోలుకుని అందుబాటులోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. కానీ వాషింగ్టన్ సుందర్ కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని సమాచారం.

ఇదిలా ఉంటే తొలి మ్యాచ్ లో యూఎస్ఏపై ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మెరుపులు పూర్తిస్థాయిలో కనిపించలేదు. పాక్ తో మ్యాచ్ కు ముందు వీరిద్దరితో పాటు శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి హిట్టర్లు పూర్తి ఫామ్ అందుకోవాలని మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. పాండ్యా కూడా చెలరేగితే తిరుగుండదు. బౌలింగ్ కూర్పును చూస్తే అక్షర్ పటేల్ , వరుణ్ చక్రవర్తి స్పిన్ ఎటాక్ లో కీలకం కానుండగా.. బుమ్రా, అర్షదీప్ పేస్ భారాన్ని మోయనున్నారు. ఇక నమీబియా విషయానికొస్తే ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడనుంది.
భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్న నమీబియాను తేలిగ్గా తీసుకున్నా ప్రమాదమే. ఎందుకంటే టీ20 ఫార్మాట్ కావడంతో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని అంచనా. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లకు సహకరించొచ్చు. ఓవరాల్ గా ఛేజింగ్ జట్టుకు విజయావకాశాలు ఉంటాయి.
📍 New Delhi
Fresh threads, same hunger 🧵#TeamIndia putting in the work ahead of their next challenge 💪 #T20WorldCup | #MenInBlue | #INDvNAM pic.twitter.com/MFxwqrfRJX
— BCCI (@BCCI) February 11, 2026



