KKR vs DC
ఐపీఎల్ 19వ సీజన్ లో ఒకే ఒక ప్లే ఆఫ్ బెర్త్ కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ తో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో కోల్ కతా తన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్(KKR vs DC) తో తలపడుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ లో కోల్ కతా గెలవడం తప్పనిసరి . అదే సమయంలో మిగిలిన కొన్ని సమీకరణాలు కూడా కలిసి రావాలి.
ఈ సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్ కావడం కేకేఆర్ కు కలిసొచ్చే అంశం. మిగిలిన జట్ల ఫలితాలను చూసుకుని వ్యూహాలు రచించుకోవచ్చు. పంజాబ్ , రాజస్థాన్ జట్లు తమ చివరి మ్యాచ్ లలో ఓడిపోతే అప్పుడు కోల్ కతా ఢిల్లీ(KKR vs DC)పై విజయం సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ పంజాబ్ జట్టు గెలిస్తే.. కేకేఆర్ తన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసి నెట్ రన్ రేట్‌లో పంజాబ్‌ను దాటాల్సి ఉంటుంది. అయితే ఈ సమీకరణాలన్నింటికీ చెక్ పెడుతూ ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ తన మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం పంజాబ్, కోల్‌కతా జట్ల కథ ముగుస్తుంది.
ఈ సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలతో నైట్ రైడర్స్ సతమతమైంది. కానీ అనూహ్యంగా సెకండాఫ్ లో పుంజుకుంది. గత ఏడు మ్యాచ్ లలో ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న కోల్ కతా సొంతగడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే కీలక ఆటగాడు రఘువంశీ గాయంతో దూరమవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పాలి.
అతని స్థానంలో తేజస్వి దహియా కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. గత మ్యాచ్ లో ముంబైని చిత్తుగా ఓడించడం రన్ రేట్ పరంగానూ కేకేఆర్ కు కలిసొచ్చింది. రహానే, గ్రీన్, పావెల్, మనీశ్ పాండే , రింకూ సింగ్ అంచనాల మేర రాణిస్తే కోల్ కతాకు తిరుగుండదు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఫాంలో ఉండగా… కార్తీక్ త్యాగి, అంకుల్ రాయ్ పైనా అంచనాలున్నాయి.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్(KKR vs DC) కథ దాదాపుగా ముగిసింది. ఒకవేళ ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జరగాలి. కోల్ కతాపై భారీ విజయం సాధించడంతో పాటు మిగిలిన మూడు జట్లు తమ చివరి మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోవాలి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ పై ఆశలు పెట్టుకోని ఢిల్లీ సీజన్ ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.
నిలకడలేని బ్యాటింగ్ ఢిల్లీ పేలవ ప్రదర్శనకు కారణమైంది. కోల్ కతాపై కేఎల్ రాహుల్, రిజ్వీ, అభిషేక్ పోరెల్, స్టబ్స్ ,మిల్లర్ వంటి బ్యాటర్లు రాణిస్తేనే గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. బౌలింగ్ లో మిఛెల్ స్టార్క్, ఎంగిడి సత్తా చాటుతున్నారు.ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్ కు అనుకూలించనుండగా ఛేజింగ్ జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది.
