KKR vs LSG : కోల్ కథ మారేనా ?…ఈడెన్ వేదికగా లక్నోతో మ్యాచ్
KKR vs LSG : ఐపీఎల్ 19వ సీజన్ లో కొన్ని జట్లు అంచనాలు తగ్గట్టే ఆడుతుండగా.. మరికొన్ని మాత్రం ఇంకా అంచనాలు అందుకోలేదు. వాటిలో కోల్ కతా నైట్ రైడర్స్ కూడా ఉంది
KKR vs LSG
ఐపీఎల్ 19వ సీజన్ లో కొన్ని జట్లు అంచనాలు తగ్గట్టే ఆడుతుండగా.. మరికొన్ని మాత్రం ఇంకా అంచనాలు అందుకోలేదు. వాటిలో కోల్ కతా నైట్ రైడర్స్ కూడా ఉంది. ప్రస్తుత సీజన్ మొదలై 10 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకూ గెలుపు రుచి చూడని కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగో మ్యాచ్ కు సిద్ధమైంది.
గురువారం హోంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(KKR vs LSG) తో తలపడబోతోంది. గత మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచిన కేకేఆర్ స్థాయికి తగిన ప్రదర్శన కనబరచడం లేదు. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లంతా ఫెయిలవుతున్నారు. ముఖ్యంగా మినీ వేలంలో రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ మూడు మ్యాచ్ లోనూ ఫ్లాప్ అయ్యాడు. కేవలం 24 పరుగులే చేసిన గ్రీన్ ఫిట్ నెస్ సమస్యలతో బౌలింగ్ కూడా వేయలేదు.
అయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ నుంచి అనుమతి రావడంతో తర్వాతి మ్యాచ్ లలో గ్రీన్ బౌలింగ్ కూడా వేసే అవకాశముంది. అలాగే రహానే, రఘువంశీ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఫిన్ అలెన్, రింకూ సింగ్, రమణ్ దీప్ సింగ్ ఇంకా పూర్తి ఫామ్ లోకి రాలేదు. ముఖ్యంగా ఫినిషర్ రింకూసింగ్ పై కోల్ కతా చాలా ఆశలు పెట్టుకుంది.
గత సీజన్ లో సైతం పెద్దగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడని రింకూ ఈడెన్ లోనైనా దుమ్మురేపుతాడేమోనని కేకేఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే గ్రీన్ తనపై ఉన్న అంచనాలు అందుకుంటాడేమో చూడాలి. అటు బౌలింగ్ లోనూ కీలక బౌలర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వైఫల్యం కేకేఆర్ కు ఇబ్బందిగా మారింది. నరైన్ తన స్పిన్ మ్యాజిక్ చూపించి చాలా ఏళ్ళయింది. అలాగే మిస్టర్ స్పిన్నర్ గా పేరున్న వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయడం మరిచిపోయాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బంతితో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న వరుణ్ గత మ్యాచ్ కు గాయంతో దూరమయ్యాడు. అలాగే నరైన్ స్థానంలో రోవమన్ పావెల్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే కాంబినేషన్ ను కొనసాగించే అవకాశముంది.

మరోవైపు తొలి మ్యాచ్ లో ఓడినా రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్(KKR vs LSG) పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. మార్కరమ్, రిషబ్ పంత్ ఫామ్ లోకి రావడం , బౌలర్లు సమిష్టిగా రాణించడం లక్నోకు మొదటి విజయాన్ని అందించాయి. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ లోనూ అదే జోరు కొనసాగించాలని లక్నో ఎదురుచూస్తోంది.
లక్నో(KKR vs LSG) బ్యాటింగ్ లో మిఛెల్ మార్ష్, నికోలస్ పూరన్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే తిరుగుండదు. ఆయుశ్ బదౌనీ, అబ్దుల్ సమద్ కూడా చివర్లో మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. అటు బౌలింగ్ లో మహ్మద్ షమీ అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ పై కేవలం 9 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు.
అతనితో పాటు ప్రిన్స్ యాదవ్ , అవేశ్ ఖాన్ కూడా రాణిస్తున్నారు. స్పిన్ విభాగంలో దిగ్వేశ్ పై అంచనాలున్నాయి. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఈడెన్ గార్డెన్స్ లో ఛేజింగ్ జట్టుకు విజయావకాశాలుంటాయి. అయితే ఈ మ్యాచ్ కు బ్యాలెన్సింగ్ పిచ్ ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 6 సార్లు తలపడగా నాలుగు మ్యాచ్ లలో లక్నోనే గెలిచింది.
TVK Party : విజయ్ కు షాక్ మీద షాక్…కీలక అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ





