Lionel Messi : చివరి వరల్డ్ కప్ ఆడేసిన మెస్సీ..అర్జెంటీనా దిగ్గజం కెరీర్ ముగిసినట్టేనా ?
Lionel Messi : 2026 ప్రపంచకప్ ఫైనల్లో మరోసారి తన మ్యాజిక్ చూపిద్దామని అనుకున్నా స్పెయిన్ ముందు అతను తలవంచక తప్పలేదు. కానీ అర్జెంటీనాకే కాదు ప్రపంచ ఫుట్‌బాల్ చూసిన అత్యుత్తమ ప్లేయర్స్ లో మెస్సీ ఎప్పటికీ నిలిచిపోతాడు.
Lionel Messi
ఎంతటి గొప్ప ఆటగాడికైనా రిటైర్మెంట్ తప్పదు.. అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు వీడ్కోలు పలికేవారు కొందరయితే, ఫామ్ కోల్పోయిన తర్వాత ఆటకు గుడ్ బై చెప్పేవారు మరికొందరు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచినా ప్రపంచకప్ లాంటి విజయాల్లో భాగమవడం కొందరికే సాధ్యమవుతుంటుంది.
కొందరికి ఆ లోటు తీరని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ విషయంలో లియోనెల్ మెస్సీ అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే సాకర్ ప్రపంచంలో స్టార్ ప్లేయర్స్ రొనాల్డో, నెయ్ మార్ వంటి ప్లేయర్స్ కు సాధ్యం కాని ప్రపంచకప్ కలను మెస్సీ 2022లోనే నెరవేర్చుకున్నాడు. ఈసారి 2026 ప్రపంచకప్ ఫైనల్లో మరోసారి తన మ్యాజిక్ చూపిద్దామని అనుకున్నా స్పెయిన్ ముందు అతను తలవంచక తప్పలేదు.
కానీ అర్జెంటీనాకే కాదు ప్రపంచ ఫుట్‌బాల్ చూసిన అత్యుత్తమ ప్లేయర్స్ లో మెస్సీ(Lionel Messi) ఎప్పటికీ నిలిచిపోతాడు. ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసినా మెస్సీ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అలా అని అతను వచ్చే ప్రపంచకప్ ఆడతాడా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మెస్సీ గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించి వెనక్కి తీసుకున్నాడు.
2016 కోపా అమెరికా ఫైనల్స్‌లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడిపోవడంతో మెస్సీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. వరుసగా మూడు ప్రధాన ఫైనల్స్ ఓడిపోవడంతో బాగా ఎమోషనల్ అయ్యి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు, దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా సైతం రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని బలంగా కోరడంతో దేశం కోసం మరోసారి ఆడాలన్న తపనతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరమించుకున్నాడు.
ఒక విధంగా ఈ నిర్ణయం మెస్సీ కెరీర్ కు మరో మలుపుగానే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే దేశానికి అత్యుత్తమ టైటిల్స్ అందించలేక రిటైర్మెంట్ ప్రకటించాడో తిరిగి అవే ట్రోఫీలను గెలిచి గర్వపడ్డాడు. రీఎంట్రీలో మెస్సీ రాణించిన తీరు అద్భుతమనే చెప్పాలి. తన అద్భుతమైన ఆటతో అర్జెంటీనాకు 2022 ఫిఫా వరల్డ్‌కప్ సాధించాడు.

అలాగే 2021,2024లో కోపా అమెరికా ట్రోఫీలను తన దేశానికి అందించాడు. అయినా సరే మెస్సీలోని గెలుపు దాహం ఇంకా తీరలేదు. అందుకే ప్రస్తుత ప్రపంచకప్ లోనూ అదరగొట్టి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే చివరి మెట్టుపై మాత్రం స్పెయిన్ ముందు చతికిలపడ్డాడు. ఈ ఓటమి తర్వాత మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు.
నిజానికి చాలా మంది దిగ్గజ ఆటగాళ్లతో పోలిస్తే మెస్సీ(Lionel Messi) కెరీర్ వరల్డ్ కప్, కోపా అమెరికా వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్ గెలవడంతోనే పరిపూర్ణమైంది. కానీ దేశానికి మరో ప్రపంచకప్ అందించి చరిత్రలో నిలిచిపోయే అవకాశం చేజారిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అటు అభిమానులు మాత్రం మెస్సీ పోరాటపటిమకు నీరాజనాలు పలికారు. ఓడినా అర్జెంటీనా, మెస్సీ అద్భుతంగా ఆడారంటూ ప్రశంసిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఏది ఏమైనా ఫుట్ బాల్ ప్రపంచంలో ఓ గొప్ప ఆటగాడి శకానికి దాదాపుగా తెరపడినట్టే.
US Student Visa : యూఎస్ కొత్త వీసా రూల్స్.. డిగ్రీలు పూర్తి కాకుండానే భారత్‌కు వచ్చేయాలా?





