Dhoni
చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫలితం కంటే ధోనీ(Dhoni) రిటైర్మెంట్ అన్న ప్రచారమే ఎక్కువగా జరిగింది. చెపాక్ లోనే తాను రిటైర్ అవుతానంటూ గతంలో ధోనీ చెప్పిన వీడియోను వైరల్ చేస్తూ ఈ సీజన్ లో అక్కడ ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ప్లేయర్ గా ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అనీ, వచ్చే సీజన్ నుంచి సపోర్టింగ్ స్టాఫ్ కే పరిమితం కానున్నాడన్న వార్తలు జోరుగా సాగాయి. ఈ సీజన్ లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడని మహి చెపాక్ లో బరిలోకి దిగుతున్నాడంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. పైగా సీఎస్కే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవ్వరూ వెళ్లిపోవద్దంటూ పెట్టిన పోస్టులు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి.
దీంతో అభిమానులు ఈ మ్యాచ్ కు పోటెత్తారు. తీరా చూస్తే ధోనీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మ్యాచ్ మధ్యలో ఒక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ధోనీ మైదానంలోకి అడుగుపెట్టడంతో స్టేడియం హోరెత్తిపోయింది. కానీ ధోనీ, తన సహచరులతో కలిసి గ్రూప్ ఫోటో సెషన్ లో పాల్గొన్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత మరోసారి గ్రౌండ్ లో కనిపించిన ధోనీ సహచరులతో కలిసి ఫ్యాన్స్ ను పలకరించాడు. చెన్నై ప్లేయర్స్ తో కలిసి మైదానంలో తిరుగుతూ అభిమానులకు జెర్సీలు, బాల్స్ గిఫ్ట్ గా అందజేశాడు. ఈ మ్యాచ్ లోనూ ధోనీ ఆడకపోవడం సీఎస్కే ఫ్యాన్స్ కు నిరాశే కలిగించినా రిటైర్మెంట్ ప్రకటన రానందుకు హ్యాపీగా ఉన్నారు.
ఇప్పుడు ధోనీకి సంబంధించి మరో చర్చ మొదలైంది. ఈ దిగ్గజ కెప్టెన్ వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న గ్రౌండ్ లో సురేష్ రైనా ధోనీతో కలిసి చాలాసేపు మాట్లాడాడు. దానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. ధోనీని ఈ సీజన్ లో ఆడాలని కోరగా శరీరం సహకరించడం లేదంటూ చెప్పాడని వెల్లడించాడు.
మాకు అదంతా తెలీదు నువ్వు ఆడాల్సిందేనంటూ రైనా అడిగినప్పుడు ధోనీ నవ్వుతూ వెళ్ళిపోయాడు.ఇక వచ్చే సీజన్ లో ధోనీ ఆడతాడా అంటూ ఎదురైన ప్రశ్నకు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం స్పష్టత ఇవ్వలేదు. అది మేనేజ్ మెంట్ చేతుల్లో ఉంటుందంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతానికి ధోనీ రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
దీని ప్రకారం చూస్తే వచ్చే సీజన్ లో ఆడే అవకాశముందని అభిమానులు అనుకుంటున్నారు. అయితే తన నిర్ణయాలను ఎవ్వరూ ఊహించని విధంగా ప్రకటించే ధోనీ(Dhoni )ఆటగాడిగా కెరీర్ ముగించి వచ్చే సీజన్ లో మెంటార్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.
