Just SportsLatest News

Rajasthan: నేడు గుజరాత్‌తో రాజస్థాన్ ఢీ.. ఈ 2 జట్లలో ఫైనల్ చేరేదెవరు?

Rajasthan: వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ మంచి ఆరంభాలనిస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

Rajasthan

ఐపీఎల్ 19వ సీజన్ ఛాంపియన్ ఎవరో తేలడానికి ఇక రెండే మ్యాచ్ లు మిగిలున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరగా, మరో బెర్త్ కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. న్యూ చండీగఢ్ వేదికగా శుక్రవారం క్వాలిఫైయర్ 2 జరగబోతోంది. రెండోసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుజరాత్ భావిస్తుంటే, సన్ రైజర్స్ ను నిలువరించి ఫుల్ జోష్ లో ఉన్న రాజస్థాన్(Rajasthan).. టైటాన్స్ కు చెక్ పెట్టాలని పట్టుదలగా ఉంది.

కాగా లీగ్ స్టేజ్ ను రెండో స్థానంతో ముగించిన గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైయర్ లో బెంగళూరుపై పరాజయం పాలైంది. భారీస్కోరు ఛేదించలేక చతికిలపడింది. ఆ మ్యాచ్ లో బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. బ్యాటర్లు నిరాశ పరిచారు. నిజానికి ఈ సీజన్ లోనూ గుజరాత్ ఓపెనింగ్ జోడీ సూపర్ ఫామ్ లో ఉంది. సాయి సుదర్శన్ – శుభ్‌మన్‌ గిల్ తమ అద్భుతమైన బ్యాటింగ్ తో మెరుపు ఆరంభాలనిస్తున్నారు. తర్వాత బట్లర్ కూడా రాణిస్తున్నాడు.

అయితే టాపార్డర్ లో ఈ ముగ్గురూ నిలబడితే ఎంత బలమో, విఫలమైతే అంతే సంగతులు. ఈ ముగ్గురూ ఫెయిలైన తర్వాత నిలకడగా రాణించే బ్యాటర్లు లేకపోవడం గుజరాత్ కు మైనస్ పాయింట్. ఈ సీజన్ లో గుజరాత్ ఓడినప్పుడు టాపార్డర్ ఫెయిలవడమే కారణం. గిల్ , సాయి సుదర్శన్ మెరుపు ఆరంభాలనిస్తేనే గుజరాత్ కు భారీస్కోరు చేసే అవకాశముంటుంది.

మిడిలార్డర్ లో నిలకడైన బ్యాటర్ ఒక్కరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది. మరోవైపు బౌలింగ్ లో గుజరాత్ నిలకడగానే రాణిస్తోంది. గత మ్యాచ్ తప్పిస్తే లీగ్ స్టేజ్ లో ఆ జట్టు కీలక బౌలర్లంతా ఆకట్టుకున్నారు. రబాడ, సిరాజ్ తో పాటు హోల్డర్ కూడా సత్తా చాటుతున్నాడు. వీరితో పాటు స్పిన్నర్లు రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ చెలరేగితే గుజరాత్ కు తిరుగుండదు.

Rajasthan
Rajasthan

మరోవైపు రాజస్థాన్ (Rajasthan)రాయల్స్ పడుతూ లేస్తూ ప్లే ఆఫ్స్ కు చేరింది. ఆ జట్టు బ్యాటింగ్ కు కూడా ఓపెనర్లే బలం. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ మంచి ఆరంభాలనిస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కొడితే సిక్సర్, లేకుంటే బౌండరీ అన్న తరహాలోనే ఆడుతున్నాడు. సన్ రైజర్స్ పై ఎలిమినేటర్ ఎలాంటి విధ్వంసం సృష్టించాడో అందరూ చూసారు. దీంతో వైభవ్ ను ఎంత త్వరగా ఔట్ చేస్తే గుజరాత్ కు అంత విజయావకాశం ఉంటుంది.

జురెల్ అదరగొడుతున్నా.. తర్వాత బ్యాటర్లు నిరాశ పరుస్తున్నారు. పరాగ్ , ఫెరీరా, జడేజా కూడా చెలరేగాల్సిన అవసరం ఉంది. మరోవైపు బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ కు మ్యాచ్ విన్నర్. తన బౌలింగ్ తో వరుస విజయాలను అందించాడు. అతనితో పాటు బర్గర్ కూడా రాణిస్తుండగా.. స్పిన్నర్లు జడేజా, యశ్ రాజ్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు.

ఇక గత రికార్డుల విషయానికొస్తే గుజరాత్ – రాజస్థాన్‌ జట్లు 10సార్లు తలపడ్డాయి. గుజరాత్ ఏడు మ్యాచుల్లో గెలిస్తే మూడింటిలో రాజస్థాన్ విజయం సాధించింది. అటు పిచ్ పరిస్థితిని చూస్తే మరోసారి పరుగుల వరద ఖాయమని అంచనా వేస్తున్నారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button