IPL Final
ఐపీఎల్ 19వ సీజన్ క్లైమాక్స్ కు చేరింది. మరికొద్ది గంటల్లో ఈ సీజన్ ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ టైటిల్ పోరులో తలపడబోతున్నాయి.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా ఫైనల్ జరగబోతోంది. బలాబలాల పరంగా , ఫామ్ పరంగా చూస్తే రెండు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో తుది పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు.
18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ ఇప్పుడు రెండో టైటిల్ పై కన్నేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టి ఫైనల్ కు దూసుకొచ్చింది. లీగ్ లో స్టేజ్ లో 9 విజయాలు సాధించి అగ్రస్థానంతో ప్లే ఆఫ్స్ కు చేరింది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్ నే ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టింది.
గత సీజన్ కంటే మరింత బలంగా కనిపిస్తోన్న ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. ఫిల్ సాల్ట్ ఫిట్ నెస్ పై స్పష్టత లేకపోవడంతో ఫైనల్లో ఆడడం అనుమానంగానే ఉంది. ఈ సీజన్ లో కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
15 మ్యాచ్ లలో 600 పరుగులు చేసిన విరాట్ తుది పోరులో చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే పటిదార్ , పడిక్కల్ , టిమ్ డేవిడ్ , జితేశ్ శర్మ హిట్టింగ్ చేస్తే ఇక ఆర్సీబీ భారీస్కోరు చేయడం ఖాయం. బెంగళూరు విజయాల్లో కనీసం ఇద్దరు, ముగ్గురు బ్యాటర్లు ప్రదర్శనే కీలకంగా మారింది. అటు బౌలింగ్ లోనూ బెంగళూరు దుమ్మురేపుతోంది.
వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేస్ పదును ఏమాత్రం తగ్గలేదు. సీజన్ ఆరంభం నుంచీ తనదైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. 15 మ్యాచ్ లలో 26 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ విజయాల్లో భువీదే కీ రోల్. అలాగే మరో ముగ్గురు పేసర్లు కూడా రాణిస్తున్నారు.
హ్యాజిల్ వుడ్, జాకబ్ డఫీ, రసిక్ సలామ్ దార్ పేస్ ఎటాక్ లో సత్తా చాటుతున్నారు. ఇక స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా అదరగొడుతున్నాడు. అతనితో పాటు సుయాశ్ శర్మ కూడా రాణిస్తున్నాడు. కాగా బెంగళూరు ఐపీఎల్ ఫైనల్(IPL Final) చేరడం ఇది ఐదోసారి.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా అద్భుతంగా రాణిస్తూ ఫైనల్ కు దూసుకొచ్చింది. నిజానికి మిగిలిన జట్లతో పోలిస్తే గుజరాత్ ఫైనల్ చేరుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అయితే బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు టైటిల్ కు అడుగుదూరంలో నిలిచింది.
గుజరాత్ బ్యాటింగ్ బలం టాపార్డర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభమన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఇచ్చే ఆరంభాలతో గుజరాత్ భారీస్కోర్లు సాధిస్తోంది. ఎలాంటి టార్గెట్ నైనా ఛేదిస్తోంది.లీగ్ స్టేజ్ ను రెండో స్థానంలో ముగించిన గుజరాత్ క్వాలిఫైయర్ 1లో మాత్రం విఫలమైంది. ఆ మ్యాచ్ లో టాపార్డర్ వైఫల్యం ఓటమికి కారణమైంది.
అయితే క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై అదే టాపార్డర్ అదరగొట్టి విజయాన్ని అందుకుంది. ఈ సమయంలో బెంగళూరుపై ప్రతీకారం కోసం గుజరాత్ ఎదురుచూస్తోంది. పైగా ఈ మ్యాచ్ వారి హోం గ్రౌండ్ అహ్మదాబాద్ లో జరగనుండడం మరో అడ్వాంటేజ్.
బ్యాటింగ్ లో గిల్, సాయి సుదర్శన్, బట్లర్ రాణిస్తే టైటాన్స్ కు తిరుగులేనట్టే. అయితే వీరు విఫలమైతే తర్వాత జట్టును ఆదుకునే బ్యాటర్ లేకపోవడం గుజరాత్ కు మైనస్ గా మారింది. అటు బౌలింగ్ లో మాత్రం గుజరాత్ మంచి ఫామ్ లో ఉంది.
రబాడ, సిరాజ్ , హోల్డర్ , ప్రసిద్ధ కృష్ణ పేస్ అటాక్ లో ఉన్నారు. రబాడ 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఫైనల్లో(IPL Final) ఆర్సీబీ బ్యాటర్లకు అతనే సవాల్ కానున్నాడు. మొత్తం మీద రెండు జట్లు దాదాపు సమానంగానే ఉన్నా హోంఅడ్వాంటేజ్ తో గుజరాత్ కాస్త పైచేయిగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ మ్యాచ్ షెడ్యూల్ రెడీ ..ఆ 7 రోజులు ఫ్యాన్స్‌కు పండగే
