RCB
ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ తాజాగా తన చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ ను ఓడించింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ(RCB) ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ , విరాట్ కోహ్లీ మెరుపు బ్యాటింగ్ తో అలరించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 65 బంతుల్లోనే 120 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాల్ట్ విధ్వంకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 76( 6 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేశాడు. అటు కోహ్లీ 38 బంతుల్లో 50 (5 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులు చేయగా.. తర్వాత రజత్ పటిదార్ కూడా మెరుపులు మెరిపించాడు.
తన ఫామ్ కొనసాగిస్తూ కేవలం 20 బంతుల్లోనే 53 (4 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ కూడా ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కేవలం 16 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 35 పరుగులే ఇచ్చినా వికెట్ తీయలేకపోయాడు. తద్వాారా ఐదు మ్యాచ్ లలోనూ వికెట్ తీయని బౌలర్ గా నిలిచాడు.
తర్వాత ఛేజింగ్ లో ముంబై దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. రికెల్టన్ ,రోహిత్ శర్మ తొలి వికెట్ కు 72 పరుగులు జోడించారు. అయితే రోహిత్ శర్మ గాయంతో రిటైర్డ్ హర్ట్ అవ్వడం ముంబై జోరుకు బ్రేక్ వేసినట్టయింది. రికెల్టన్ 37 , సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులకు ఔటవగా.. తిలక్ వర్మ (1) మరోసారి ఫెయిలయ్యాడు.
కెప్టెన్ హార్థిక్ పాండ్యా తనదైన మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 22 బంతుల్లో 40 (6 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రూథర్ ఫర్డ్ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చివరి వరకూ వణికించాడు. భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ పవర్ హిట్టర్ ను వేలంలో ముంబై ఎందుకు తీసుకుందో అందరికీ అర్థమైంది. మరో ఎండ్ లో సపోర్ట్ లేకున్నా ముంబైని గెలిపించేందుకు చివరి వరకూ రూథర్ ఫర్డ్ పోరాడాడు.
కేవలం 31 బంతుల్లోనే 71 పరుగులు చేయగా 1 ఫోర్, 9 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది. అలాగే రూథర్ ఫర్డ్ కు చివర్లో మరొక ఎండ్ లో సపోర్ట్ లభించి ఉంటే ముంబై గెలిచేది. చివరికి ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులకు పరిమితమైంది. ఆర్సీబీ(RCB) బౌలర్లలో సుయాశ్ శర్మ 2 వికెట్లు తీసాడు. కాగా ఆర్సీబీకి ఇది మూడో విజయం. అటు ముంబైకి ఇది మూడో పరాజయం.
HCA : హెచ్ సీఎకు త్వరలో మంచిరోజులు…కొత్త సెక్రటరీ జీవన్ రెడ్డి
