HCA : హెచ్ సీఎకు త్వరలో మంచిరోజులు…కొత్త సెక్రటరీ జీవన్ రెడ్డి
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే వివాదాలకు చిరునామాగా ఉంటుంది
HCA
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే వివాదాలకు చిరునామాగా ఉంటుంది. ముఖ్యంగా గత కొన్నేళ్ల నుంచి విపరీతమైన అవినీతి ఆరోపణలు.. ఫేక్ క్లబ్బులు, ఆటగాళ్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు.. ఇలా అనేక వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో పాత ప్రెసిడెంట్, సెక్రటరీలపై వేటు పడడంతో కొత్త వారు కార్యవర్గంలోకి వచ్చారు.
హెచ్ సీఎ(HCA) కు కొత్త సెక్రటరీగా జీవన్ రెడ్డి ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను వివాదాలకు తావు లేకుండా అవినీతి రహితంగా నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్లబ్ సెక్రటరీలు, అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన ఆయన అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. హెచ్ సీఎకు త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయని చెప్పారు. అసోసియేషన్ ను పారదర్శకంగా నడిపిస్తామని తెలిపారు.
క్లబ్ సెక్రటరీలకు ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా వచ్చి తనను కలవచ్చని , స్టేడియంలోని తన ఛాంబర్ లో అందుబాటులో ఉంటానని తెలిపారు. అసోసియేషన్ ను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నడిపించడమే తన లక్ష్యమన్నారు. ఆటగాళ్ల వయసు మోసాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.

ప్రతీ ప్లేయర్ బర్త్ సర్టిఫికెట్,. ఆధార్ కార్డును అప్లికేషన్ తో పాటు క్లబ్స్ తీసుకోవాలని సూచించారు. గత కొన్నేళ్ళుగా అండర్ 19 ఆటగాళ్ళ వయసు విషయంలో పలు మోసాలను గుర్తించారు. ఈ క్రమంలో కొందరు ప్లేయర్స్ పై నిషేధం కూడా పడింది. అలాంటి మోసాలకు తావులేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టు కొత్త సెక్రటరీ జీవన్ రెడ్డి తెలిపారు. అలాగే క్లబ్ సెక్రటరీల సూచన ఆధారంగా నాలుగురోజుల మ్యాచ్ లను మూడురోజుల మ్యాచ్ లుగా మార్చే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇప్పటి వరకూ జరిగిన కొన్ని పరిణామాలతో నెలకొన్న గందరగోళ పరిస్థితులను తొలగించి అసోసియేషన్ ను నిబద్ధతతో నడిపిస్తామన్నారు. హెచ్ సీఎ(HCA) సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని, ఎటువంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే లీగ్ టోర్నమెంట్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.
Gemma 4 : ఇంటర్నెట్ అక్కర్లేదు.. ఆఫ్లైన్లో పనిచేసే గూగుల్ కొత్త యాప్ ఎలా పనిచేస్తుంది?





