Just SportsLatest News

RCB :రఫ్ఫాడించిన ఆర్సీబీ…చెన్నైకి మూడో ఓటమి

RCB :విధ్వంసం...ఊచకోత... బహుశా ఈ పదాలు కూడా సరిపోవేమో... చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటింగ్ చూసిన తర్వాత చాలా మంది ఇదే అనుకున్నారు

RCB

విధ్వంసం…ఊచకోత… బహుశా ఈ పదాలు కూడా సరిపోవేమో… చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ(RCB) బ్యాటింగ్ చూసిన తర్వాత చాలా మంది ఇదే అనుకున్నారు.. ఏమా బ్యాటింగ్.. కొడితే సిక్సర్..లేకుంటే ఫోర్… సింగిల్స్ ఊసే లేదు…నువ్వు కొడితే నేను కూడా కొడతా అన్నట్టుగా ఆర్సీబీ బ్యాటర్లు ఒకరిని మించి ఒకరు చెలరేగిపోయారు.

సాల్ట్, పటిదార్, పడిక్కల్ పోటాపోటీగా విధ్వంసం సృష్టించారు. టిమ్ డేవిడ్ హిట్టింగ్ అయితే వేరే లెవెల్.. దీంతో 250 పరుగుల భారీస్కోరు.. ఛేజింగ్ లో చెన్నై తడబడినా పోరాడి ఓడింది. నిజానికి చిన్నస్వామి స్టేడియం అంటేనే పరుగుల వరద.. బౌలర్లకు కాళరాత్రులే అన్నది మరోసారి రుజువైంది. కోహ్లీ నిరాశపరిచినా ఫిల్ సాల్ట్ మెరుపులు మెరిపించాడు.

30 బంతుల్లో 46 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి ఔటవగా.. ఇక్కడ నుంచి పటిదార్, పడిక్కల్ రెచ్చిపోయారు. వీరిద్దరూ చెరొక ఎండ్ నుంచీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కేవలం 21 బంతుల్లోనే 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పడిక్కల్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి ఔటవగా.. తర్వాత పటిదార్, టిమ్ డేవిడ్ దూకుడు కొనసాగించారు. కేవలం 39 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు.

అసలు టిమ్ డేవిడ్ బ్యాటింగ్ వేరే లెవెల్ లో సాగింది. సీఎస్కే బౌలర్లను చెడుగుడు ఆడుకున్న టిమ్ డేవిడ్ భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. బంతి ఎలా వేసినా సిక్సర్లు బాదేశాడు. అతను కొట్టిన ఓ షాట్ కు బంతి స్టేడియం అవతల పడిందంటే ఏ స్థాయిలో ఆడాడో అర్థం చేసుకోవచ్చు. టిమ్ డేవిడ్ విధ్వంసంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 70 (3 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అలాగే పటిదార్ 19 బంతుల్లో 6 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ తప్పిస్తే మిగిలిన వారంతా భారీ పరుగులు సమర్పించుకున్నారు.

భారీ లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్ లో ఉన్న సంజూ శాంసన్ మళ్లీ నిరాశపరిచాడు. రుతురాజ్ గైక్వాడ్, ఆయుశ్ మాత్రే కూడా వెంటవెంటనే ఔటవడంతో సీఎస్కే 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కార్తీక్ శర్మ (6), శివమ్ దూబే(18) కూడా విఫలమైనా.. సర్ఫరాజ్ ఖాన్ మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు.

RCB
RCB

కేవలం 25 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో సర్ఫరాజ్ ఔటైన తర్వాత ప్రశాంత్ వీర్, ఓవర్టన్ కాసేపు మెరుపులు మెరిపించారు. బ్యాటింగ్ పిచ్ కావడంతో భారీ షాట్లతో అలరించారు. ఒక దశలో సీఎస్కే సంచలనం సృష్టిస్తుందేమోనని ఆ జట్టు అభిమానులు ఆశించారు.

అయితే కృనాల్ పాండ్యా , డఫీ, భువనేశ్వర్ కీలక సమయంలో వికెట్లు తీసి దెబ్బకొట్టారు. ప్రశాంత్ వీర్ 29 బంతుల్లో 43 ( 6 ఫోర్లు, 1 సిక్సర్ ), ఓవర్టన్ (37) పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. టాపార్డర్ లో బ్యాటర్లు రాణించి ఉంటే చెన్నై ఈ మ్యాచ్ లో అద్భుతం సాధించేది. చివరికి చెన్నై 207 పరుగులకు ఆలౌటైంది.

Lucknow Super Giants : సన్ రైజర్స్ కు షాక్…లక్నో చేతిలో చిత్తు

Related Articles

Back to top button