RR vs SRH
ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. కొన్ని జట్లు అంచనాలకు తగ్గట్టే అదరగొడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో దుమ్మురేపుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి టాప్ ప్లేస్ లో ఉంది. అలాంటి టీమ్ ను సన్ రైజర్స్(RR vs SRH) హైదరాబాద్ తన హోంగ్రౌండ్ లో ఎదుర్కొనబోతోంది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒకటే గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
ఈ సీజన్ లో బ్యాటింగ్ పరంగా రాణిస్తున్నా, బౌలింగ్ బలహీనంగా ఉండడంతో ఆరెంజ్ ఆర్మీకి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మరి ఈ బౌలింగ్ తో ఉప్పల్ స్టేడియం లాంటి ఫ్లాట్ వికెట్ పై రాజస్థాన్ రాయల్స్(RR vs SRH) బ్యాటర్లను సన్ రైజర్స్ ఎంతవరకూ అడ్డుకుంటుందో చూడాలి. రాజస్థాన్ జట్టులో అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు.
పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్ లో రెండు సార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసిన వైభవ్ ను అడ్డుకోవడంపైనే సన్ రైజర్స్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అలాగే జైస్వాల్, జురెల్ కూడా ఫామ్ లో ఉండడంతో హైదరాబాద్ బౌలర్లకు సవాల్ గానే చెప్పాలి. అటు రాజస్థాన్ బౌలింగ్ లో ఆర్చర్, బర్గర్, రవి బిష్ణోయ్ రాణిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ శర్మను ఆడించే అవకాశముంది.
మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్(RR vs SRH) పూర్తి ఒత్తిడిలో కనిపిస్తోంది. బ్యాటింగ్ లో అదరగొడుతున్నా బౌలర్లు ఫ్లాప్ అవుతున్నారు. గత మ్యాచ్ లో 219 పరుగులు చేసినా, ఓటమికి కారణం చెత్త బౌలింగే. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, హెడ్ కూడా ఫామ్ లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం.
అయితే పంజాబ్ కింగ్స్ పై వీరిద్దరూ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు అనుకున్నంత వేగంగా ఆడలేకపోవడం కూడా ఓటమికి కారణమైంది. క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ పైనా విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు కూడా కొంపముంచాయి. ఇక బౌలింగ్ సంగతి సరేసరి. ఈ సీజన్ ఆరంభమైనప్పటి నుంచి సన్ రైజర్స్ బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అందరికీ అర్థమవుతోంది. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటు తెలుస్తోంది. బౌలింగ్ లో హర్షల్ పటేల్, ఉనాద్కట్ రాణించడం లేదు.
ఎహసాన్ మలింగ ఒక్కడే పర్వాలేదనిపిస్తుండగా హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ పై బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ ఇలాగే ఉంటే 250 ప్లస్ స్కోరు చేసినా ఉపయోగముండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రికార్డుల్లో రాజస్థాన్ పై సన్ రైజర్స్ దే పైచేయిగా ఉంది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కే అనుకూలం. దీంతో మరో హైస్కోరింగ్ మ్యాచ్ ఖాయమని చెప్పొచ్చు.
Asha Bhosle : దిగ్గజ గాయని ఆశా భోస్లే ఇకలేరు…సంగీత ప్రపంచం ఘన నివాళి
