India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో వైట్ వాష్.. భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే
India : వరల్డ్ ఛాంపియన్స్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు. ఈ రెండు సిరీస్‌ల ఫలితాల తర్వాత భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి.
India
సరిగ్గా మూడు వారాల క్రితం ఐర్లాండ్ టూర్‌కు వెళ్లినప్పుడు వరల్డ్ నెంబర్ వన్, ఐపీఎల్లో దుమ్మురేపిన కుర్రాళ్లు , సీనియర్లు, జట్టుపై భారీ అంచనాలు..కట్ చేస్తే మూడు వారాల తర్వాత సీన్ మొత్తం రివర్స్..ఐర్లాండ్ చేతిలో 0-2 తో వైట్ వాష్, ఇంగ్లాండ్ గడ్డపైనా 0-4 తో వైట్ వాష్..ఈ ఫలితాలతో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కూడా పోయింది.
అసలు వరల్డ్ ఛాంపియన్స్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు. ఈ రెండు సిరీస్‌ల ఫలితాల తర్వాత భారత్(India) నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటర్లు కేవలం ఫ్లాట్ పిచ్‌లపైనే కాకుండా, బంతి బాగా స్వింగ్ అయ్యే విదేశీ పరిస్థితులకు తగినట్లుగా టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవాలి.
విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు గతంలో పిచ్‌లపై నీళ్లు చల్లించి మరీ స్వింగ్ కోసం ప్రాక్టీస్ చేసిన విధానాలను యువ ఆటగాళ్లు అలవర్చుకోవాలి. వైట్-బాల్ క్రికెట్లో వ్యూహాత్మక లోపాలను సరిదిద్దుకోవడానికి బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సీనియర్లు, యువ ఆటగాళ్ల సమన్వయం లోపించడం కూడా ఓటముల కారణం. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యాలను అధిగమించి అన్ని విభాగాల్లోనూ నిలకడను ప్రదర్శించడం నేర్చుకోవాలి. ఇంగ్లాండ్‌లోని పిచ్‌లపై లభించే అదనపు సీమ్, స్వింగ్‌ను ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధత అవసరం. ఇది దృష్టిలో ఉంచుకుని నెక్స్ట్ టైమ్ టూర్‌కు వచ్చేటపుడు పరిస్థితులకు అలవాటు పడటానికి కనీసం రెండు వారాల ముందే ఇక్కడ కచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఐపీఎల్ ఆడేసి డైరెక్టుగా ఇక్కడకు వచ్చి సిరీస్ ఆడేద్దాం అంటే మాత్రం ఫలితాలు ఇలాగే ఉంటాయని మాజీ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు. అలాగే కీలక ఆటగాళ్లకు బ్యాకప్‌పై మరింత దృష్టి సారించాలని కొంతమంది సూచిస్తున్నారు.
ఎందుకంటే బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల భారత బౌలింగ్ విభాగం తేలిపోయింది. వీరు లేనప్పుడు కూడా జట్టును నడిపించగల సమర్థవంతమైన ప్రత్యామ్నాయ ఫాస్ట్ బౌలర్లను, పేస్ ఆల్రౌండర్లను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయాలి.

అలాగే ఈ పర్యటనలో క్యాచ్‌లు వదిలేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్‌లో అలసత్వం ప్రదర్శించడం వల్ల భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో ఫీల్డింగ్‌పై కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తూనే, జట్టును సమర్ధవంతంగా నడిపే వ్యూహాలను సిద్ధం చేసే భాధ్యత కూడా కోచ్ గంభీర్‌పై ఉంది. ఈ తప్పులను సరిదిద్దుకుని భారత(India) జట్టు త్వరలోనే ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లోనైనా పుంజుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
Date Of Birth : జూలై 12న ఏ నెంబర్ వాళ్లకు ఎలాంటి లక్ ఉంది?ఎవరికి ఫుల్ ఎంజాయ్మెంట్, ఎవరికి అలసట?





