Just TechnologyLatest News

OnePlus : వన్‌ప్లస్ ఫోన్ యూజర్స్‌కు షాక్.. ఆ దేశాల్లో మూసివేతకు నిర్ణయం

OnePlus : అమెరికా, యూరప్‌లో వన్‌ప్లస్ ఫోన్లు వాడుతున్న వారికి వాటి సపోర్ట్ గడువు ముగిసే వరకు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లు అందుతాయి.

OnePlus

ఐఫోన్ , శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలకు గట్టిపోటీనిచ్చిన వన్‌ప్లస్(OnePlus) త్వరలో షట్ డౌన్ కాబోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. గతంలోనే ఈ ప్రచారం జరిగినా అప్పుడు కంపెనీ ఖండించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ పూర్తిగా మూతపడకున్నా కొన్ని దేశాల్లో షట్ డౌన్ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అమెరికా, యూరప్ దేశల్లో వన్‌ప్లస్‌ను మూసివేయబోతున్నట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం వన్‌ప్లస్ ఫోన్ల అమ్మకాలు పడిపోవడమే. ముఖ్యంగా ఆన్‌లైన్ మార్కెట్‌లో వన్‌ప్లస్ ఫోన్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. హై-ఎండ్ ఫోన్ల విభాగంలో పోటీ పెరగడం, ఆఫ్‌లైన్ రిటైలర్ల బాయ్‌కాట్, పాత యూజర్లలో బ్రాండ్ పట్ల నమ్మకం సడలడం వంటి సమస్యల వల్ల ఈ క్షీణత కనిపించింది.

ఆఫ్‌లైన్ విక్రయాలు నిలిపివేయడం, లాభాలు తక్కువగా ఉండటం, వారంటీ ప్రాసెసింగ్‌లో జాప్యం వంటి సమస్యల వల్ల భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రిటైలర్లు వన్‌ప్లస్ ఫోన్ల అమ్మకాలను నిలిపివేశారు. దీంతో కంపెనీ తన సేల్స్‌ను పూర్తిగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు మళ్లించాల్సి వచ్చింది.

ఆక్సిజన్ ఓఎస్ స్థానంలో కలర్ ఓఎస్‌ను తీసుకురావడం వల్ల వన్‌ప్లస్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చే క్లీన్ అండ్ ఫాస్ట్ ఆండ్రాయిడ్ అనుభూతి తగ్గిపోయింది. ఇది పాత యూజర్లకు నిరాశను కలిగించింది. ఫోన్లలో డిస్‌ప్లే సమస్యలు రావడం ,సర్వీస్ సెంటర్ల ద్వారా సకాలంలో స్పందన లేకపోవడం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసింది.

ప్రీమియం మొబైల్స్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించి, ఆ తర్వాత చౌకైన నార్డ్ సిరీస్‌ను తీసుకురావడం ద్వారా ప్రీమియం బ్రాండ్ అనే ఇమేజ్ కాస్త బలహీనపడింది. అమెరికా , యూరప్ మార్కెట్లలో వన్‌ప్లస్ ఫోన్ల విక్రయాలు తగ్గిపోయాయి. చాలా ప్రాంతాల్లో దీని స్వతంత్ర గుర్తింపు తగ్గిపోయి, మాతృసంస్థ అయిన ఒప్పోలో విలీనం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. భారతదేశంలో కూడా ప్రత్యేక వన్‌ప్లస్ రిటైల్ స్టోర్లను మూసివేసి, మొత్తం సర్వీసింగ్, సేల్స్ బాధ్యతలను ఒప్పోకు ట్రాన్స్‌ఫర్ చేశారు.

OnePlus
OnePlus

ఇప్పటికే అమెరికా, యూరప్‌లో వన్‌ప్లస్ ఫోన్లు వాడుతున్న వారికి వాటి సపోర్ట్ గడువు ముగిసే వరకు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లు అందుతాయి. కస్టమర్లకు సర్వీస్ సెంటర్ సేవలు, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ మార్కెట్లలో ప్రస్తుతం మిగిలి ఉన్న స్టాక్ ఖాళీ అయిపోయాక, వన్‌ప్లస్(OnePlus) నుంచి ఎలాంటి కొత్త ఫోన్లు లేదా పరికరాలు విడుదల కావు.

ఇదిలా ఉంటే భారత్, చైనా మార్కెట్లలో వన్‌ప్లస్ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయనీ కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్‌కు భారత్ అత్యంత కీలకమైన ,అతిపెద్ద మార్కెట్ కావడం వల్ల ఇక్కడ వ్యాపారానికి ఎటువంటి ఢోకా లేదు. అయితే, భవిష్యత్తులో కేవలం బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ పరికరాలపైనే ఈ బ్రాండ్ ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. వన్‌ప్లస్(OnePlus) తప్పుకుని.. ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఒప్పో తన స్వంత బ్రాండ్ పేరిట విస్తరించాలని చూస్తోంది.

Satellite Phone : బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ ..అడవులు, కొండల్లోనూ పనిచేసే సూపర్ డివైస్ స్పెషాలిటీలు ఇవే..

Related Articles

Back to top button