Just TelanganaJust PoliticalLatest News

Kaleshwaram Project : అన్నదాత ఆశల ప్రాజెక్టు కాళేశ్వరానికి ఆటంకాలెందుకు? మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?

Kaleshwaram Project : తెలంగాణ సాగునీటి రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది

Kaleshwaram Project

తెలంగాణ సాగునీటి రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కొంతకాలంగా అనిశ్చితిలో ఉన్న బ్యారేజీల మరమ్మతు పనులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం ఈ ప్రాజెక్టుపై ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, తాము నిర్ణయించిన టైమ్ లైన్‌లోగా పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలన్నిటినీ పూర్తి చేసి, క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

దేశంలోనే అతి పెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) గుర్తింపు పొందింది. గోదావరి నది నీటిని ఎగువ ప్రాంతాలకు తరలించి దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని నిర్మించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే మూడు ప్రధాన బ్యారేజీల ద్వారా భారీగా నీటిని నిల్వ చేసి, ఈ నీటిని భారీ పంపుల ద్వారా వివిధ జిల్లాలకు తరలించేలా ఈ ప్రాజెక్టును అప్పటి సీఎం కేసీఆర్ రూపొందించారు. 2016లో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణానికే లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అప్పటి గణాంకాలు చెబుతున్నాయి.

కాగా 2023 సంవత్సరం చివరలో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోని ఏడో బ్లాక్ వద్ద పిల్లర్లు కుంగిపోవడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపైన ఒక్కసారిగా నీలినీడలు ముసురుకున్నాయి. అక్కడ పిల్లర్లు కుంగిపోవడమే కాకుండా బ్యారేజీ కింద భారీగానే ఇసుక కొట్టుకుపోయిందని, అంతేకాకుండా నిర్మాణాత్మక లోపాలు కూడా ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిర్ధారించింది.

భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని బ్యారేజీలలో నీటిని నిల్వ చేయడాన్ని కూడా నిలిపివేశారు. దీనివల్ల రెండున్నరేళ్లుగా ఉత్తర తెలంగాణ రైతులకు అందాల్సిన సాగు నీటి సరఫరాలో పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అయితే అటు ప్రతిపక్షాల విమర్శలు, ఇటు కేంద్ర కమిషన్ల సూచనలతో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పటి వరకూ ప్రశ్నార్థకంగానే మారిపోయింది.

అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిపిన సమీక్షలో కాళేశ్వరం అనేది ప్రజల ఆస్తి అని, దానిని కాపాడటం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల మరమ్మతులతో పాటు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే సమగ్ర అధ్యయనాన్ని చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ మరమ్మతులన్నీ పూర్తి చేసేలా ఒక టైమ్ షెడ్యూల్ రూపొందించారు.

ఈ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం ఇరిగేషన్ శాఖతో పాటు ఒక స్పెషల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసి, ప్రతి దశలో కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సభ్యుల తాలూకా సలహాలు తీసుకునేలా చర్యలు చేపట్టారు.

Kaleshwaram Project
Kaleshwaram Project

మరమ్మతులకు అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి లోటు రానీయబోమని, పనుల వేగాన్ని పెంచడానికి మేడిగడ్డ వద్దే ప్రత్యేక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తానని చెప్పడంతో ఇప్పుడు అధికారుల్లో కదలిక వచ్చింది. డిజైన్ల తయారీ నుంచి యంత్రాల సేకరణ వరకు పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించడానికి అధికారులు రెడీ అవుతున్నారు.

ఈ నిర్ణయంతో ఎట్టకేలకు ప్రాజెక్టుకు మోక్షం కలగబోతుందని, రాబోయే రోజుల్లో తమ పొలాలకు మళ్లీ గోదావరి జలాలు అందుతాయన్న సంతోషంలో ఉత్తర తెలంగాణ రైతాంగం ఉంది. మొత్తంగా ప్రాజెక్టును రాజకీయ కోణంలో కాకుండా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీనిని పునరుద్ధరించడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Mukul Choudhary : వచ్చేసాడు మరో యువ సంచలనం…ఎవరీ ముకుల్ చౌదరి ?

Related Articles

Back to top button