Peddamma Thalli:జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం.. ఈ దివ్య క్షేత్రం గురించి మీకీ సంగతులు తెలుసా?

Peddamma Thalli: గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలతో, విశాలమైన నేత్రాలతో శంఖం, త్రిశూలం, ఖడ్గం ధరించి ప్రకాశిస్తూ దర్శనమిస్తారు.

Peddamma Thalli

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వెలసిన పెద్దమ్మ తల్లి(Peddamma Thalli) ఆలయం గురించి.. తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సుమారు 2000 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ గుడి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది.

పురాణాలలో చెబుతున్న దాని ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు.. బ్రహ్మ ఇచ్చిన వరంతో ఇష్టానుసారంగా విర్రవీగుతూ ముల్లోకాలను పీడిస్తుండగా..ఆ సమయంలో, త్రిమూర్తుల అభ్యర్థనతో మహిషాసురుడుని అంతమొందించడానికి అమ్మవారు శక్తి స్వరూపిణిగా అవతరించారట.

భీకర పోరాటం తర్వాత అమ్మవారు మహిషాసురుడిని అంతమొందించాక, అలసట తీర్చుకోవడానికి జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని బండరాళ్ల మధ్య విశ్రాంతి తీసుకున్నారని, అందుకే ఇక్కడ వెలసిన తల్లిని పెద్దమ్మ తల్లిగా పిలుస్తారని స్థల పురాణం చెబుతోంది.

పెద్దమ్మ ఆలయ నిర్మాణం ఎంతో వైభవంగా ఉంటుంది. ఏడు అంతస్తుల రాజగోపురం , ఐదు అంతస్తుల గర్భాలయ నిర్మాణం భక్తులనే కాదు ఇంజనీర్లను,ఆర్కిటెక్చర్‌లను కూడా మంత్రముగ్ధులను చేస్తాయి.

గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలతో, విశాలమైన నేత్రాలతో శంఖం, త్రిశూలం, ఖడ్గం ధరించి ప్రకాశిస్తూ దర్శనమిస్తారు. గర్భాలయం వెనుక వైపున ఉన్న నవదుర్గల ఆలయం కూడా ఎంతో విశేషమైనదిగా చెబుతారు.

ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే రథసప్తమి రోజు పెద్దమ్మ తల్లి ఆలయంలో నిర్వహించే చండీ హోమం, బలిహరణం అత్యంత ప్రసిద్ధి. అమ్మవారికి జరిగే ఈ వేడుకను దర్శించుకుంటే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు , అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Peddamma Thalli

అలాగే ఆషాఢ మాసంలో జరిగే బోనాలు, శాకాంబరి ఉత్సవాలు ,దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా చాలా వైభవంగా జరుగుతాయి. ఏడాదికోసారి ఘనంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రజలే కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మతల్లి(Peddamma Thalli)ని కొలిచిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించే వారు ఇక్కడ పూజలు చేయడం ఎన్నో ఏళ్లగా ఆనవాయితీగా వస్తోంది.

Conversations:ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలా? గొడవలు జరగకుండా ఇది ఫాలో అవ్వండి చాలు

Exit mobile version