Just LifestyleLatest News

Conversations:ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలా? గొడవలు జరగకుండా ఇది ఫాలో అవ్వండి చాలు

Conversations:ఏదైనా ఒక విషయాన్ని చర్చించాలని అనుకునేటప్పుడు మనం ఏం చెబుతున్నామనే దానికంటే కూడా అసలు ఏ సమయంలో చెబుతున్నామనేది చాలా చాలా ముఖ్యం.

Conversations

జీవితంలో బంధాలు ఎంత ముఖ్యమో, ఆ బంధాల మధ్య వచ్చే అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనకు ఇష్టమైన స్నేహితులతో కానీ, ప్రాణప్రదమైనవారితో కానీ, మన జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు మన కంట్రోల్ తప్పుతుంటాయి.

ముఖ్యంగా సున్నితమైన విషయాలను గురించి చర్చించేటప్పుడు చిన్న మాట కూడా పెద్ద మంటగా మారిపోయి, గొడవలకు దారి తీయొచ్చు. మరి ఇలాంటి సున్నితమైన సంభాషణలను (Conversations) ఎలా మాట్లాడాలి? చర్చలు సాగుతూ వచ్చి చివరకు అవే చిచ్చు పెట్టకుండా, పరిష్కారానికి మార్గం చూపేలా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఏదైనా ఒక విషయాన్ని చర్చించాలని(Conversations) అనుకునేటప్పుడు మనం ఏం చెబుతున్నామనే దానికంటే కూడా అసలు ఏ సమయంలో చెబుతున్నామనేది చాలా చాలా ముఖ్యం. అవతలి వ్యక్తి ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడో ఏదో టెన్షన్‌లో ఉన్నప్పుడో మీకు సీరియస్‌గా అనిపించిన విషయాన్ని మొదలుపెడితే, అది కచ్చితంగా వికటిస్తుంది.

అందుకే, ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించాలనో, మాట్లాడాలనో అనుకుంటే మాత్రం ముందు అవతలి వ్యక్తి మానసిక స్థితిని (Mood) గమనించాలి. వారు కూల్‌గా, మీ మాట వినడానికి ఓపికతో ఉన్నప్పుడు మాత్రమే అసలు విషయాన్ని ప్రస్తావించండి.

వీలైతే, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, ఇప్పుడు మీకు ఖాళీ ఉందా? అని ముందుగానే అవతలి వ్యక్తిని పర్మిషన్ అడగండి. దీనివల్ల వారు కూడా ఈ విషయం వినడానికి, చర్చించడానికి మానసికంగా సిద్ధమవుతారు.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యమైన విషయాలు ఏమైనా సరే ఎప్పుడూ నలుగురిలో మాట్లాడకూడదు. ఎవరూ లేని ప్రదేశాన్ని ఎంచుకోవడం వల్ల ఇద్దరూ కూడా స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.

ఇద్దరి ఫోన్లు పక్కన పెట్టి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. వాతావరణం ప్రశాంతంగా ఉంటే, చర్చించే విషయాలు వేడిగా ఉన్నా కూడా అవతలి వ్యక్తిలో ఆవేశం రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి.

చాలా చర్చలు గొడవలుగా మారడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వినడం కంటే, సమాధానం చెప్పడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటారు మానసిక నిపుణులు. అవతలి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో అడ్డుతగలడం వల్ల వారి భావాలు దెబ్బతింటాయి.

ఎప్పుడయినా సరే ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తిగా వినాలి. ఒకవేళ వారి పాయింట్ మీకు అర్థం కాకపోతే, ఆవేశపడకుండా మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థం కాలేదు, ఇంకోసారి వివరిస్తారా అని సున్నితంగా అడగాలి. ఇది మీరు వారికి , వారి మాటకు గౌరవిస్తున్నారనే భావనను కలిగిస్తుంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే..సమస్యను ఎప్పుడూ కూడా మీ వైపు నుంచే చూడకండి. అవతలి వ్యక్తి ఇలా ఎందుకు ప్రవర్తించారు? వారి పరిస్థితి ఏంటి? అనే కోణంలో (Empathy) ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న చర్చ కేవలం ఇద్దరిలో ఒకరు గెలవడం కోసం కాదు, ఇద్దరూ కలిసి ఆ సమస్యను పరిష్కరించడం కోసం అని గుర్తుంచుకోవాలి.

Conversations
Conversations

చర్చ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరి గొంతు పెరగకుండా, సౌమ్యంగా ఉండేలా చూసుకోండి. మాటల్లో మీరు అది చేశారు, మీరు ఇది చేశారని నిందించేలా కాకుండా, మీ ప్రవర్తన వల్ల నాకు ఇలా అనిపించిందని మీ భావాలను వారి ముందు వ్యక్తపరచండి.

కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వారిద్దరి మధ్య చర్చ(Conversations) వేడెక్కొచ్చు, ఆవేశం కట్టలు తెంచుకోవచ్చు. అలాంటప్పుడు మొండిగా వాదనను కొనసాగించకండి. ఇప్పుడు మనమిద్దరం కూడా కొంచెం ఆవేశంలోనే ఉన్నాం, కాసేపు ఆగి మాట్లాడుకుందామని చిన్న బ్రేక్ తీసుకోండి. దాని తర్వాత కాసేపు ఒంటరిగా ఉండి ఆలోచించడం వల్ల కోపం తగ్గుతుంది. ఆ తర్వాత ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక మార్గం లేదా ప్రత్యామ్నాయ పరిష్కారం గురించి చర్చించాలి.

ఎందుకంటే బలమైన బంధాలు ఏర్పడటానికి నెలలు,కొన్నిసార్లు ఏళ్లు పడుతుంది. కానీ ఒకే ఒక పొరపాటు వల్ల ఆ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే సున్నితమైన విషయాల్లో చర్చించినపుడు(Conversations) సంయమనం పాటిస్తే, మీ బంధం మరింత పటిష్టమవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Airport : ఏపీలో ఎయిర్‌పోర్టుల జోరు.. ఏ జిల్లాలో ఏయే ఎయిర్‌పోర్టులు ఉన్నాయో తెలుసా?

Related Articles

Back to top button