Just TelanganaLatest News

TGIIC:ఎకరం రూ.237 కోట్లు.. టీజీఐఐసీ భూములకు ఎందుకింత డిమాండ్ ?

TGIIC : గతేడాది రాయదుర్గం, గచ్చిబౌలి, కోకాపేట్ ప్రాంతాల్లో ఎకరం రూ.170 కోట్లకు పైగా ధర పలికితే ఇప్పుడు దానిని మించిన రికార్డు ధర నమోదైంది.

TGIIC

హైదరాబాద్ పరిధిలో ఐటీ కారిడార్ ను మరింత విస్తరించాలన్న ప్రభుత్వ ప్రణాళికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్( TGIIC) భూములకు ఎప్పటిలానే రికార్డు ధరలు పలుకుతున్నాయి. గతేడాది రాయదుర్గం, గచ్చిబౌలి, కోకాపేట్ ప్రాంతాల్లో ఎకరం రూ.170 కోట్లకు పైగా ధర పలికితే ఇప్పుడు దానిని మించిన రికార్డు ధర నమోదైంది.

తాజాగా రాయదుర్గం పాన్‌ మక్తాలో ఎకరం రూ.237 కోట్లు పలికింది. సర్వే నంబర్‌ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం జరుగుతోంది. ఈ భూములను కొనుగోలు చేసేందుకు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఎగబడుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఇక్కడే ఎకరం ధర రూ.177 కోట్లు పలికింది. ఇప్పుడు దానికి 60 కోట్లు అదనంగా ధర పలికింది.

కొన్నేళ్లుగా అంతకంతకూ రికార్డు ధర పలుకుతూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా ఐటీ హబ్ గా పేరున్న హైదరాబాద్ లో ముఖ్యంగా హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలీ, రాయ్ దుర్గ్ ,ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకూ ప్రపంచంలోనే టాప్ కంపెనీలు ఇక్కడ కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. స్థానికంగా ఉన్న రియల్టర్సే కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ భూములను సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నాయి.

ఈ భూములకు రికార్డు స్థాయిలో ధరలు పలకడానికి కారణాలను చూస్తే నమ్మకమైన పెట్టుబడిగా చెబుతుంటారు. టీజీఐఐసీ(TGIIC) అభివృద్ధి చేసే లేఅవుట్లలో భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఉండవు. వివాదరహితంగా ఉండటం వలన కొనుగోలుదారులు అత్యంత సురక్షితంగా భావిస్తున్నారు. అదే సమయంలో ఈ భూములు ప్రధానంగా ఐటీ కారిడార్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసరాల్లో ఉండటం మరో కారణం.

TGIIC
TGIIC

ప్రభుత్వమే రోడ్లు, విద్యుత్, నీరు వంటి వసతులు కల్పించడం వల్ల వ్యాపారాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అటు పరిశ్రమలకు రాయితీలు మరో ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు టీజీఐఐసీ లేఅవుట్లలో స్థలాలు కేటాయించడం ద్వారా ప్రభుత్వం నుంచి లభించే రాయితీలు సులభంగా అందుతాయి. ప్రభుత్వానికి ఈ భూములు భారీ ఆదాయ వనరుగా మారింది. పారిశ్రామిక , వాణిజ్య అవసరాల కోసం ప్రభుత్వం వేలం వేసే టీజీఐఐసీ భూములు, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.

హైదరాబాద్‌ మహానగర విస్తరణలో భాగంగా విదేశీ పెట్టుబడులు, ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు కూడా ఉపయోగపడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా నగర విస్తరణ పెరిగిపోవడంతో భూముల లభ్యత తక్కువైపోయింది. ఈ కారణంగా ఐటీ కారిడార్ సమీపంలో చిన్నపాటి భూమి ఉన్నా.. డిమాండ్ విపరీతంగా ఉంటోంది. దీంతో ఎన్ని వందల కోట్లు ఇచ్చేందుకైనా రియల్టర్లు, కార్పొరేట్ సంస్థలు వెనుకాడడం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button