Trainee IPS : పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అరాచకం..లేడీ ఐపీఎస్ ఆఫీసర్‌కు వేధింపులు
Trainee IPS : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని కొన్ని కఠినమైన సెక్షన్లతో పాటు, ఐటీ చట్టంలోని సెక్షన్ 66(C) కింద కూడా కేసులు నమోదు చేశారు.
Trainee IPS
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఒక షాకింగ్ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక ట్రైనీ ఐపీఎస్(Trainee IPS )అధికారి, తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపైన లైంగిక వేధింపులకు పాల్పడటం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నిందితుడైన ఉదయ్ కృష్ణారెడ్డి తనకు కొంతకాలంగా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ తీవ్రంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా, జూలై 9వ తేదీన తనను బలవంతంగా ఒక రూమ్‌లోకి లాక్కెళ్లడమే కాకుండా, మెడపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పారు.
ఆ సమయంలో తన అనుమతి లేకుండా కొన్ని ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని..తర్వాత తన మొబైల్ ఫోన్‌ను లాక్కుని, ఆ వీడియోలను డైరెక్టుగా తన భర్త వాట్సాప్ నెంబర్‌కే పంపించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ ఘోరంతో తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్లు బాధితురాలు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని కొన్ని కఠినమైన సెక్షన్లతో పాటు, ఐటీ చట్టంలోని సెక్షన్ 66(C) కింద కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడంతో పాటు, బాధితురాలి వీడియోలు పంపిన మొబైల్స్, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

దేశంలోనే అత్యున్నత స్థాయి పోలీసు బాస్‌లను తయారుచేసే పెద్ద అకాడమీలో ఇలాంటి ఘటన జరగడం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే దీనిపై నేషనల్ పోలీస్ అకాడమీ యాజమాన్యం మాత్రం ఇంకా ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు.
ప్రస్తుతం ఈ కేసుపై విచారణ నడుస్తోంది. అయితే, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కూడా బాధితురాలి ఆరోపణలను ప్రాథమిక సమాచారంగానే పరిగణిస్తారు. విచారణలో తేలే సాక్ష్యాలను బట్టే తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయి.
CJP : రేపే సీజేపీ పార్లమెంట్ మార్చ్ .. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్..





