Just TelanganaJust Andhra PradeshLatest News

Weather : అటు ఎండలు ఇటు వానలు.. ఏపీ, తెలంగాణలో ఈ 3 రోజులు వెదర్ అప్‌డేట్ ఇదే

Weather : ఒకవైపు వర్షాలు కురిసినా సరే గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత , అసౌకర్యమైన వాతావరణం కొనసాగుతుంది.

Weather

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భానుడి భగభగలు కొనసాగుతుండగానే, మరి కొన్నిచోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ (Weather )శాఖ విశ్లేషణ ప్రకారం, తూర్పు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న గాలుల ద్రోణి వల్ల ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడవ్వడంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ(Weather) కేంద్రం హెచ్చరించింది.

ముందుగా ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే, ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో గురువారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది . అయితే, ఒకవైపు వర్షాలు కురిసినా సరే గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత , అసౌకర్యమైన వాతావరణం కొనసాగుతుంది.

దక్షిణ కోస్తాలో మాత్రం రాగల మూడు రోజులు ముఖ్యంగా పొడి వాతావరణమే ఉండబోతోంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే, గురు, శుక్రవారాల్లో ఒకటి, రెండు చోట్ల జల్లులు పడే అవకాశం ఉన్నా కూడా, శనివారం నాటికి వాతావరణం మళ్లీ పొడిగా మారిపోతుంది.

రాబోయే ఐదు రోజుల్లో రాయలసీమలో ఎండలు తీవ్రంగా ఉంటాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక తెలంగాణలో కూడా వాతావరణ పరిస్థితులు ఏపీలాగే ఉండబోతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే, గురువారం, శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather
Weather

ఈ సమయంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉండొచ్చు. ఏపీలో లాగే తెలంగాణలో కూడా వర్షాలు తగ్గి పొడి వాతావరణం ఏర్పడుతుంది. అయితే, వర్షాల తర్వాత టెంపరేచర్ మళ్లీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని, రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల వరకు ఎక్కువ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఏప్రిల్ నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల అకాల వర్షాలు పడుతున్నాయి. ఇది రైతులకు కొంత ఆందోళన కలిగించే విషయమే అయినా కూడా.. సామాన్య ప్రజలకు ఎండ వేడి నుంచి టెంపరరీ రిలీఫ్‌ లభిస్తుంది. అయితే ప్రజలు ఈదురు గాలులు, ఉరుముల సమయంలో చెట్ల కింద , విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.

Tamil Nadu : తమిళనాడులో ఓటెత్తిన చైతన్యం..నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయి పోలింగ్

Related Articles

Back to top button