Aqil Akhtar: డ్రగ్స్ వల్లే చనిపోయాడు… మాజీ డీజీపీ కుమారుడి కేసులో ట్విస్ట్
Aqil Akhtar: ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆగస్టు 27న అఖిల్ రికార్డు చేసిన ఒక వీడియో తీవ్ర సంచలనానికి కారణమైంది.

Aqil Akhtar
పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తాఫా కుమారుడు అఖిల్ అఖ్తర్(Aqil Akhtar) మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అఖిల్ డెత్ మిస్టరీ అనూహ్య మలుపులు తిరుగుతోంది. రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. అక్టోబరు 16వ తేదీన తన ఇంట్లో అఖిల్ మృతి చెందాడు. అనారోగ్య కారణాలతో చనిపోయాడని అందరూ అనుకుంటుండగా.. వారి కుటుంబ సన్నిహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆగస్టు 27న అఖిల్ రికార్డు చేసిన ఒక వీడియో తీవ్ర సంచలనానికి కారణమైంది. తన తండ్రికి తన భార్యతో అక్రమ సంబంధం ఉందని, ఇది తెలిసి తాను తట్టుకోలేకపోయానని ఆ వీడియోలో అఖిల్(Aqil Akhtar) చెప్పుకొచ్చాడు. తల్లి, ఇతర కుటుంబసభ్యులు కూడా తన తండ్రికే మద్ధతిస్తూ తనను పిచ్చోడిలా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. చంపాలని కూడా చూస్తున్నారని, తన ప్రాణహాని ఉందంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో వెలుగు చూడడంతో పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నారు. అయితే తన కొడుకు(Aqil Akhtar) వీడియోలో చెప్పిన మాటలను మాజీ డీజీపీ మహ్మద్ ముస్తాఫా ఖండించారు. ఈ క్రమంలో కొడుకు గురించి సంచలన విషయాలు వెల్లడించారు. 18 ఏళ్ళు అఖిల్ డ్రగ్స్ కు బానిసయ్యాడని, డబ్బులు కోసం వేధించేవాడని చెప్పారు. తాము డబ్బులు ఇవ్వకుండా, డ్రగ్స్ ను మానిపించే క్రమంలో ఇలా మాట్లాడాడని చెప్పుకొచ్చారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని , కోడలితో వివాహేతర సంబంధం పూర్తిగా అవాస్తమన్నారు. త్వరలోనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు మాజీ డీజీపీతో పాటు ఆయన భార్యపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కేసు నమోదైనంత మాత్రాన తాము నేరస్థులం కాదని ముస్తాఫా చెబుతున్నారు. గతంలో ఒకసారి డబ్బులు ఇవ్వకపోవడంతో తమ ఇంటికి కుమారుడు అఖిల్ నిప్పు పెట్టాడని చెప్పారు. దీనిపై అప్పట్లోనే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తమ పరువు పోకూడదనే ఉద్దేశంతోనే బయటకు చెప్పలేదని తెలిపారు. కొడుకు చేష్టలు భరించలేకనే తన కోడలు పిల్లలను తీసుకుని వేరే ఇంట్లో ఉంటుందని వెల్లడించారు. గతంలో తన భద్రతా సిబ్బందిపైనా కొడుకు దాడి చేసాడని, కావాలంటే వారిని పిలిపించి అడగాలని కోరారు.
ఒకసారి చండీగఢ్‌లో పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డాడని గుర్తు చేసుకున్నారు. డ్రగ్స్ కు బానిసై పూర్తిగా మానసిక స్థితి కోల్పోయాడని, ఒక వీడియోలో అదే విషయాన్ని కొడుకు అఖిల్ చెప్పినట్టు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. కాగా అఖిల్ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాజీ డీజీపీ ఇచ్చిన స్టేట్ మెంట్ ను కూడా పరిగణలోకి తీసుకున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.