Cyclone Mantha: ఈ రాత్రి గడిస్తే చాలు.. చిగురుటాకులా వణుకుతున్న ఏపీ
Cyclone Mantha: ఇప్పటి నుంచి మరో 18 గంటల పాటు మొంథా తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ రాత్రి అత్యంత కీలకమని చెబుతున్నారు.
Cyclone Mantha
మొంథా తుఫాను (Cyclone Mantha)ప్రభావం ఏపీ చిగురుటాకులా వణికిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో గత వారం రోజులుగా ఎడతెరపి లేని వర్షాలతో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ఇప్పుడు తుఫానుగా మారడంతో అందరికీ టెన్షన్ మరింత పెరిగింది. మచలీపట్నానికి 230 కి.మీ, కాకినాడకు 310 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాను తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశముందని హెచ్చరించింది.
ఇప్పటి నుంచి మరో 18 గంటల పాటు మొంథా తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ రాత్రి అత్యంత కీలకమని చెబుతున్నారు. మచలీపట్నం,కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ నిర్థారించింది. తుఫాను(Cyclone Mantha) ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కాకినాడ సమీపంలో ఉన్న ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.ఇప్పటికే బలమైన ఈదురుగాలులతో భారీగా అసలు ఎగిసిపడుతున్నాయి.

గంటకు 90-110 కిమీ కంటే ఎక్కువ వేగంతో ఈ గాలులు వీస్తున్నాయి. కాకినాడ బీచ్ రోడ్ అంతా నీట మునిగింది. సముద్ర తీరానికి సమీపంలోని ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఇప్పటికే కోనసీమ, కాకినాడ , శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ వాతావరణ శాఖ 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
పలు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. అటు సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావిత జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అటు పలు రైళ్ళను రద్దు చేశారు. అలాగే చాలా వరకూ విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలంతా ఇళ్ళలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. రీల్స్ కోసం, ఫోటోలు, వీడియోల కోసమో సముద్రం దగ్గరకు వెళ్ళొద్దని కూడా సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు, కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని కోరుతున్నారు.
రైలు పట్టాలు, వంతెనల వద్ద భద్రత పెంచారు. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాక్ లు, బ్రిడ్జీల దగ్గర ఎల్లప్పుడూ పెట్రోలింగ్ బృందాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్ లో చిక్కుకున్న ప్రయాణికులకు ఆహారం, మంచినీళ్ళు పంపిణీ చేస్తున్నారు.



