Road accident: చేవెళ్లలో రోడ్డు ప్రమాదం ఇలా జరిగిందా?
Road accident: రాంగ్ రూట్లో అతివేగంతో వచ్చిన టిప్పర్ లారీ, ప్రమాదకర మలుపు వద్ద అదుపు తప్పి తాండూరు డిపో బస్సును బలంగా ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
Road accident
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు , కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడం వల్ల ఈ ఘోర ప్రమాదం (Road accident)జరిగింది. ఈ ప్రమాదానికి అతి వేగం , ప్రమాదకర మలుపు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి.
ఈ విషాదకర ఘటనలో జరిగిన ప్రాణనష్టం , గాయాల వివరాలు గుండెను కలచివేసే విధంగా ఉన్నాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతుల్లో 18 మంది ప్రయాణికులు, బస్సు , టిప్పర్ డ్రైవర్లు ఉన్నారు. ఇందులో 11 మంది మహిళలు, 9 మంది పురుషులు, ఒక ఏడాది పాప కూడా ఉన్నారు. 24 మందికి గాయాలయ్యాయి, అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
టిప్పర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టడమే కాక, లారీలోని కంకర (Crushed Stone) మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడటం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు కంకర కింద కూరుకుపోయి ఊపిరాడక చనిపోయారు.

హైదరాబాద్-బీజాపూర్ హైవే, చేవెళ్ల మండలం మీర్జాగూడ/ఖానాపూర్ స్టేజీ వద్ద ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో అతివేగంతో వచ్చిన టిప్పర్ లారీ, ప్రమాదకర మలుపు వద్ద అదుపు తప్పి తాండూరు డిపో బస్సును బలంగా ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ,సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కంకరలో కూరుకుపోయిన మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీయడానికి జేసీబీ (JCB) యంత్రాలను ఉపయోగించారు. ఈ ప్రమాదం వలన చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ ఘోర ప్రమాదం(Road accident)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి వెంటనే సీఎస్ (చీఫ్ సెక్రటరీ), డీజీపీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
గాయపడిన వారందరినీ ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని ..సహాయక చర్యలను వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని , తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు.



