1st Test: బోణీ కొట్టేది ఎవరో ? ఈడెన్ లో భారత్,సౌతాఫ్రికా తొలి టెస్ట్
1st Test: ఈడెన్ పిచ్ తొలి రెండు రోజులు స్వింగ్ బౌలర్లతో పాటు బ్యాటర్లకు అనుకూలం. ఇక చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లు ఆధిపత్యం కనబరిచే అవకాశముంది.
1st Test
సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల(test) సిరీస్ కు భారత్ రెడీ అయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. డబ్ల్యూటీసీ 2026-27 సైకిల్లో భారత్ కు ఇది మూడో సిరీస్, ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ను నమం చేసిన టీమిండియా తర్వాత స్వదేశంలో విండీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్ ఇప్పుడు సౌతాఫ్రికాపై సిరీస్ గెలిస్తే అగ్రస్థానానికి చేరువవుతుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో శుభారంభం కోసం ఉవ్విళ్ళూరుతోంది.
శుభమన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు సొంతగడ్డపై ఎప్పుడూ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. గత రికార్డుల పరంగానూ, బలాబలాల పరంగానూ చూస్తే సఫారీలపై భారత్తో పైచేయి. అయితే డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన జట్టుకు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే భారత్ కూడా ఈ మ్యాచ్కు అత్యుత్తమ టీమ్తో నే బరిలోకి దిగుతోంది.

ఈడెన్ టెస్ట్ (test) కోసం భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసినట్టే. ఫైనల్ ఎలెవెన్లో ఇద్దరు వికెట్ కీపర్లు ఆడడం ఖాయమైంది. పంత్ వికెట్ కీపర్ హానూ, జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్ గానూ ఆడనున్నారు. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్, మూడో స్థానంలో సాయి సుదర్శన్, తర్వాత గిల్, పంత్, జురెల్ బ్యాటింగ్ కు వస్తారు. ఆల్ రౌండర్ కోటాలో జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కొచ్చు. పేస్ విభాగంలో బుమ్రాతో పాటు సిరాజ్ కు చోటు ఖాయం. అయితే కులీప్ ను పక్కన పెడితే మాత్రం అక్షర్ పటేల్ జట్టులోకి వస్తాడు. కుల్దీప్, అక్షర్ పటేల్ లో ఒకరిని ఎంపిక చేసుకోవడం చాలా పెద్ద సవాల్ గా గిల్ అభివర్ణించాడు.
మరోవైపు ఇటీవలే పాకిస్తాన్ తో టెస్ట్ సిరీసు సమం చేసిన సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది. డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న సఫారీలను బవుమా నడిపిస్తున్నాడు. పలువురు కొత్త ఆటగాళ్లు జట్టులోకి రాగా, సీనియర్లు కూడా ఉన్నారు. బౌలింగ్ లో రబాడా, మార్కో జెన్సన్ పేస్ ఎటాక్లో కీలకం కానుండగా.. స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. ముత్తుసామి, కేశవ్ మహారాజ్, హార్మర్ ముగ్గురూ జట్టులో ఉండడం ఖాయం. ఇటీవల పాక్ సిరీస్ లో ఈ నఫారీ స్పిన్ త్రయం అద్భుతంగా రాణించింది. టెస్ట్ ఫార్మాట్ కు సంబంధించి ఓవరాల్ రికార్డుల్లో భారత్ పై సఫారీలడే పైచేయిగా ఉంది.
ఇరు జట్లు 44 సార్లు తలపడగా సౌతాఫ్రికా 18 టెస్టుల్లో(test), భారత్ 16 టెస్టుల్లో గెలిచాయి. 10 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. స్వదేశంలో మాత్రం భారత్ ఆధిపత్యం కనబరిచింది. ఇరు జట్లు 19 సార్లు తలపడితే భారత్ 11 సార్లు, దక్షిణాఫ్రికా 5 సార్లు గెలిస్తే, 3 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై ఈ సారి అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. కివీస్ చేతిలో వైట్వాష్ పరాభవం తర్వాత పూర్తి స్పిన్ పిచ్ లకు గంభీర్ నో చెప్పాడు. తొలి టెస్టుకు స్పోర్టింగ్ వికెట్ రూపొందించాలని క్యూరేటర్ కు సూచించాడు. ఈడెన్ పిచ్ తొలి రెండు రోజులు స్వింగ్ బౌలర్లతో పాటు బ్యాటర్లకు అనుకూలం. ఇక చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లు ఆధిపత్యం కనబరిచే అవకాశముంది.



