WhatsApp:మార్చి 1 నుంచి మారుతున్న వాట్సాప్ రూల్స్.. ఏంటీ సిమ్ బైండింగ్?
WhatsApp: చాలా మంది కొత్త సిమ్ కార్డ్స్ వాడినా వాట్సాప్‌కు మాత్రం పాత నంబర్ వాడుతూ ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎక్కువగా వాడుతున్న వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది. మార్చి 1 నుంచి సిమ్ బైండింగ్ అనే కొత్త కండిషన్ అమల్లోకి రాబోతోంది. ఈ రూల్ ప్రకారం, మీ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉన్న సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్(WhatsApp) పని చేస్తుంది.
ఇప్పటి వరకు మనం ఒక నంబర్‌తో వాట్సాప్(WhatsApp) క్రియేట్ చేసి, ఆ తర్వాత సిమ్ కార్డు తీసేసినా లేదా ఆ సిమ్ వేరే ఫోన్‌లో ఉన్నా కూడా .. వైఫై సాయంతో వాట్సాప్ వాడుకునే అవకాశముండేది. కానీ ఇకపై అలా కుదరదు. ఏ నంబర్‌తో అయితే వాట్సాప్ వాడుతున్నారో, ఆ సిమ్ కార్డు కచ్చితంగా అదే ఫోన్‌లో ఉండాలి. ఒకవేళ మీరు ఫోన్ నుంచి సిమ్ తీసేస్తే, మీ వాట్సాప్ ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది.
గతేడాది నవంబర్‌లోనే ఈ విషయాన్ని ప్రకటించినా, సోషల్ మీడియా కంపెనీలు తమ టెక్నాలజీని మార్చుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువిచ్చారు. అంటే రేపటితోనే ఆ గడువు ముగియబోతోంది. దీని ప్రకారం మార్చి 1 నుంచి మీ ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే.. వాట్సాప్ అకౌంట్ ఆగిపోతుంది. మళ్లీ మీరు వాడాలంటే అదే సిమ్ కార్డును ఫోన్‌లో వేసి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు చాలా మంది సైబర్ నేరగాళ్లు వేరే వాళ్ల పేర్ల మీద ఉన్న సిమ్ కార్డులతో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. కేవలం ఇంటర్నెట్ ఉంటే వాట్సాప్ పని చేస్తుంది కాబట్టి, ఆ తర్వాత సిమ్ కార్డులను పారేసి ..ఆ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇలాంటి వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా కష్టమవుతోంది.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం సిమ్ బైండింగ్ విధానాన్ని తెచ్చింది. దీనివల్ల ఏ ఫోన్ నుంచి మెసేజ్ వెళ్తుందో, అందులో ఏ సిమ్ ఉందో ఈజీగా తెలిసిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే, మీ వాట్సాప్ అకౌంట్ మీ ఫోన్ లోని సిమ్ కార్డుతో లాక్ అయిపోతుందన్నమాట.
అంతేకాదు.. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్‌లో వాట్సప్ వెబ్ (WhatsApp Web) వాడే వారికి కూడా ఒక చిన్న షాకిస్తున్నారు. ఇక నుంచి ప్రతీ 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా వాట్సప్ వెబ్ లాగౌట్ అయిపోతుంది. అంటే మళ్లీ మళ్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

ఆఫీసుల్లో లేదా ఇతరుల కంప్యూటర్లలో వాట్సప్ లాగిన్ చేసి మర్చిపోతుంటారు. అయితే ఇప్పుడు అది కొద్దిసేపటికే ఆగిపోతుంది .కాబట్టి మన పర్సనల్ డేటా ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉండదు. ఈ మార్పుల వల్ల మన ప్రైవసీకి మరింత సేఫ్టీ అన్నమాట.
ఈ కొత్త నిబంధన అమల్లోకి రావడానికి కేవలం ఒక రోజే సమయం ఉన్నట్లు అవుతుంది కనుక.. ఒకవేళ మీరు ఒక నంబర్‌తో వాట్సాప్ వాడుతూ, ఆ సిమ్ కార్డును వేరే చిన్న ఫోన్‌లోనో లేదా పక్కనో పెట్టేసి ఉన్నా.. వెంటనే దానిని మీ వాట్సాప్ ఉన్న ఫోన్‌లోకి మార్చుకోవాలి. లేకపోతే మార్చి 1 న మీ అకౌంట్ స్టాప్ అయ్యే అవకాశం ఉంది.
ఇది ఐప్యాడ్‌లు, సిమ్ కార్డు సపోర్ట్ లేని టాబ్లెట్లలో వాట్సప్ వాడుతున్న వారికి ఇది ఇబ్బందే అవుతుంది.చాలా మంది కొత్త సిమ్ కార్డ్స్ వాడినా వాట్సాప్‌కు మాత్రం పాత నంబర్ వాడుతూ ఉంటారు. అలాంటి వారు తమ వాట్సప్ లోని చేంజ్ నంబర్ (Change Number) ఆప్షన్ ఉపయోగించి ప్రస్తుతమున్న సిమ్ కార్డు నంబర్‌కు అకౌంట్‌ను మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చాటింగ్స్ , డేటా పోదు.



