ENG vs NZ : గెలిచే మ్యాచ్‌లో ఓడిన కివీస్..పాక్ సెమీస్ ఆశలు సజీవం
ENG vs NZ : టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేస్ మరింత ఉత్కంఠగా మారిపోయింది. ముఖ్యంగా సూపర్ 8 గ్రూప్ 2లో ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ లోనూ గెలిచి రేసును రసవత్తరంగా మార్చేసింది.
ENG vs NZ
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేస్ మరింత ఉత్కంఠగా మారిపోయింది. ముఖ్యంగా సూపర్ 8 గ్రూప్ 2లో ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ లోనూ గెలిచి రేసును రసవత్తరంగా మార్చేసింది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న ఇంగ్లీష్ టీమ్ ఓడిపోయే మ్యాచ్ లో కివీస్ పై గెలిచింది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలుస్తుందనుకున్న న్యూజిలాండ్(ENG vs NZ) చివర్లో పట్టుసడలించి ఓటమి చవిచూసింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్(ENG vs NZ) గెలుపుతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్ పిచ్ కావడంతో మంచి టార్గెట్ నిర్థేశించే లక్ష్యంతో వేగంగా ఆడింది. ఈ క్రమంలో వికెట్లు కూడా కోల్పోయింది. ఓపెనర్లు స్టివర్ట్ ,. ఫిన్ అలెన్ తొలి వికెట్ కు 64 పరుగులు జోడించారు.
అయితే స్పిన్నర్ల ఎంట్రీతో కివీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులు చేయడంతో మంచి స్కోరు సాధించగలిగింది. చివరి మూడు ఓవర్లలో వికెట్లు చేజార్చుకున్నా పరుగులు కూడా చేయగలిగింది. ఫలితంగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ , రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్ లో కివీస్ పేసర్లు విజృంభించడంతో ఆరంభంలోనే ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోయింది. కేవలం 58 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. ఫిల్ సాల్ట్ 2, బట్లర్ 0 , హ్యారీ బ్రూక్ 26, బెథెల్ 21 పరుగులకు ఔటయ్యారు. తర్వాత టామ్ బాంటర్, సామ్ కరన్ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ఈ దశలో న్యూజిలాండ్ బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టారు. దీంతో కివీస్ విజయం ఖాయంగా కనిపించింది. అయితే 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సిన దశలో విల్ జాక్స్ , రెహాన్ అహ్మద్ మెరుపు బ్యాటింగ్ తో చెలరేగిపోయారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లు బాదేయడంతో ఇంగ్లాండ్ మరో 3 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
ఇంగ్లాండ్ విజయంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. శనివారం పాక్ జట్టు లంకపై గెలిస్తే కివీస్ తో సమానంగా మూడేసి పాయింట్లతో నిలుస్తుంది. కివీస్ రన్ రేట్ ను అధిగమించాలంటే పాకిస్థాన్ శ్రీలంకను 65 పరుగులు లేదా టార్గెట్ ను 13 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది.



