Prashant Kishor: పాపం పీకే.. పీకిందేమీ లేదు.. జీరోగా మిగిలిన ప్రశాంత్ కిషోర్
Prashant Kishor: మూడేళ్ల క్రితమే బీహార్‌పై దృష్టిసారించారు ప్రశాంత్ కిశోర్(Prashant Kishor). బీహార్ బద్లావ్ పేరుతో 2022లో పాదయాత్ర చేపట్టారు. మూడువేల కిలోమీటర్లు ఇంటింటికి తిరిగారు.
Prashant Kishor
గొప్ప ప్లేయర్ గొప్ప కెప్టెన్ కాలేడు.. గొప్ప కెప్టెన్ గొప్ప కోచ్ కాలేడు…ఇది క్రికెట్ లో తరచుగా వినిపించే మాట.. కానీ రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తుంది. గొప్ప రాజకీయ వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) స్వయంగా పార్టీ పెట్టి బొక్క బోర్లా పడ్డారు. రాజకీయ నాయకుడిగా అట్టర్ ప్లాప్ అయ్యారు.
రాజకీయ వ్యూహ కర్తగా బిజెపి, జెడ్ యు, కాంగ్రెస్, ఆప్, వైసిపి, డీఎంకే, టీఎంసీ పార్టీలను విజయపథంలో నడిపించి అధికార పీఠాలపై కూర్చోబెట్టానని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఏడాదిన్నర క్రితం జన సురాజ్… జేఎస్పి పార్టీని పెట్టి… బీహార్ అంతా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు. పీకే ని చూసేందుకు, కలిసేందుకు జనం తండోపతండాలుగా వచ్చినాఎన్నికల్లో మాత్రం ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో తన సొంత రాష్ట్రం బీహార్ లో పీకే జీరోగా మిగిలిపోయారు.
సర్వేలు,సోషల్ మీడియా వ్యూహాల్లో ఆరితేరిన పీకే..బీహార్‌లో కనీసం ఖాతా తెరవలేకపోయారు. రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానని హామీ ఇచ్చే ప్రయత్నం చేసినా బిహారీలు మాత్రం జన్‌సురాజ్ పార్టీవైపు కన్నెత్తి చూడలేదు. దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసినా బోణీ కూడా కొట్టలేదు.పీకే పార్టీ3.44 శాతం ఓట్లతో అనేకచోట్ల మూడో స్థానానికే పరిమితమైంది.

కొన్నేళ్ల క్రితం I-PAC పేరుతో ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు, బూత్ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి సరికొత్త అస్త్రాలతో పలు పార్టీల విజయంలో కీ రోల్ ప్లే చేశారు. చాయ్ పే చర్చా, అబ్ కీ బార్ మోడీ సర్కార్ వంటి నినాదాలతో ప్రచారాలను కొత్త పుంతలు తొక్కించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగికి రోడ్ షోలు, బిహార్‌లో నీతీశ్ నాయక్, పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌కు కాఫీ విత్ కెప్టెన్ ,ఏపీలో జగన్ నవరత్నాలు వంటివి అందించారు. ఏపీలో కులవిద్వేషాలు సృష్టించి ఓట్లు సంపాదించవచ్చని బలంగా నమ్మిన పీకే. వినూత్న విధానాలతో అందర్నీ గట్టెక్కించిన పీకే.. సొంత రాష్ట్రంలో తాను మాత్రం చేతులెత్తేశారు.
నిజానికి మూడేళ్ల క్రితమే బీహార్‌పై దృష్టిసారించారు ప్రశాంత్ కిశోర్(Prashant Kishor). బీహార్ బద్లావ్ పేరుతో 2022లో పాదయాత్ర చేపట్టారు. మూడువేల కిలోమీటర్లు ఇంటింటికి తిరిగారు. సామాజిక వేత్తలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఆయన సభలకు, రోడ్‌షోలకు భారీస్థాయిలో జనం వచ్చినా..అవి ఓట్లుగా మారలేదు.
సంస్థాగతంగా బలంగా లేకపోవడమే పీకేకు మైనస్. జనాదరణ ఉన్న నేతలు లేకపోవడం, కొన్నిచోట్ల క్యాడర్ తిరుగుబాటు, చివరి క్షణంలో నేతలు పార్టీలు మారడం వంటివి జన్ సురాజ్నీ దెబ్బతీసాయి. ప్రధాన పార్టీలు పీకే పార్టీని ప్రత్యర్థుల బీ-టీమ్‌గా ప్రచారం చేశాయి. పోటీకి దూరంగా ఉన్న ప్రశాంత్ కిశోర్ పార్టీ బలోపేతం పైనే దృష్టిపెట్టారు. పోలింగ్‌కు ముందే ఫలితాలను అంచనా వేసిన ఆయన.. వస్తే 150, లేదంటే పది సీట్లు వస్తాయని చెప్పేశారు. చివరికి ఆ పది కూడా రాకుండా జీరోగా మిగిలిపోయారు.



