Travel: ప్రకృతిని రక్షిస్తూనే మీ జర్నీని ఎంజాయ్ చేయండి..ఎలా అంటే?
Travel: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, శక్తి , నీటి వినియోగాన్ని పరిమితం చేయడం, వీలైనంత వరకు కాలినడకన లేదా సైకిల్‌పై ప్రయాణించడం వంటివి చేయాలి.
Travel
ఆధునిక ప్రయాణాలలో (Travel) అత్యంత వేగంగా పెరుగుతున్న ధోరణి ‘స్థిరమైన పర్యాటకం’ (Sustainable Tourism). ఇది కేవలం పర్యావరణ అనుకూలమైన హోటల్లో ఉండటం కాదు. మనం సందర్శించే ప్రాంతం యొక్క పర్యావరణానికి, సామాజిక, సాంస్కృతిక సమగ్రతకు (Cultural Integrity) హాని కలిగించకుండా, ఆ ప్లేస్‌ను కాపాడం కోసం దోహదపడే విధంగా ప్రయాణించడం.
పర్యాటకం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు (Local Economy) మద్దతు ఇవ్వడం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం మరియు పర్యావరణ వ్యవస్థలను (Ecosystems) పరిరక్షించడం దీని లక్ష్యం.
సాంప్రదాయ పర్యాటకం (Mass Tourism) తరచుగా ఎక్కువగా అభివృద్ధి చెందడం, పర్యావరణ కాలుష్యం (Pollution), వ్యర్థాల (Waste) పెరుగుదల, స్థానిక సంస్కృతులు దెబ్బతినడానికి దారితీస్తుంది. దీనికి వ్యతిరేకంగా, స్థిరమైన పర్యాటకులు పర్యావరణాన్ని గౌరవిస్తారు.
వీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, శక్తి , నీటి వినియోగాన్ని పరిమితం చేయడం, వీలైనంత వరకు కాలినడకన లేదా సైకిల్‌పై ప్రయాణించడం వంటివి చేస్తారు. అంతేకాకుండా, వారు స్థానిక ప్రజలచే నిర్వహించబడే చిన్న వసతి గృహాలలో (Local Homestays) ఉండటానికి, లోకల్ మార్కెట్లలో వస్తువులు కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు.

స్థిరమైన పర్యాటకం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. ఇది ప్రయాణ అనుభూతిని మరింత లోతుగా, అర్థవంతంగా (Meaningful) చేస్తుంది. స్థానిక సంస్కృతి, జీవన విధానం , ప్రజలతో నేరుగా సంభాషించడం ద్వారా పర్యాటకులు ఆ స్థలాన్ని మరింత దగ్గరగా అనుభూతి చెందుతారు.
ఇది కేవలం ఫోటోలు తీసుకోవడం లేదా అక్కడి ప్రకృతి అందాలు చూడటం కాదు. ఒక ప్రాంతం యొక్క నిజమైన జీవనాన్ని అనుభూతి చెందడం. స్థిరమైన పర్యాటకాన్ని ఎంచుకోవడం ద్వారా, మనం మన హాలీడేస్‌ను మరింత బాధ్యతగా , హ్యాపీగా మార్చుకోవచ్చు. దీనిద్వారా రాబోయే తరాలకు కూడా అందమైన, వైవిధ్యభరితమైన ప్రపంచాన్ని మిగిల్చడానికి దోహదపడతాం.



