Dhanush Srikanth: డెఫ్లంఫిక్స్ లో ధనుష్ సంచలనం.. స్వర్ణం గెలిచిన హైదరాబాదీ షూటర్
Dhanush Srikanth: హైదరాబాద్ కు చెందిన ధనుష్ శ్రీకాంత్(Dhanush Srikanth) గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అదరగొడుతున్నాడు.
Dhanush Srikanth
డెఫ్లంఫిక్స్ లో భారత్ కు అదిరిపోయే ఆరంభం దక్కింది. హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్(Dhanush Srikanth) ప్రపంచ రికార్డ్ ప్రదర్శనతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో ధనుష్ గత కార్డులను బ్రేక్ చేస్తూ 252.2 పాయింట్లు స్కోర్ చేసి ఔరా అనిపించాడు. ఈ విభాగంలో అగ్రస్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించాడు.
అలాగే మరో భారత షూటర్ మహ్మద్ ముర్తాజా వానియా 250.1 పాయింట్లు స్కోర్ చేసి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ఇదే విభాగంలో భారత్ కు స్వర్ణం, రజతం రెండూ లభించాయి. క్వాలిఫికేషన్ రౌండ్లోనూ ధనుష్ శ్రీకాంత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫైనల్ కు చేరే క్రమంలో 630.6 పాయింట్లు స్కోర్ చేశాడు. 2021 డెఫ్లంఫిక్స్ లోనూ ధనుష్ బంగారు పతకం గెలిచాడు.
హైదరాబాద్ కు చెందిన ధనుష్ శ్రీకాంత్(Dhanush Srikanth) గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అదరగొడుతున్నాడు. 14 ఏళ్ల వయసులో షూటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధనుష్ పలు సంచలనాలు నమోదు చేశాడు. బొమ్మ తుపాకీతో షూటింగ్ చేస్తుండడం చూసి అతని తల్లిదండ్రులు ధనుష్ ను ప్రోత్సహించారు. 2015లో ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్ అకాడమీ గన్ ఫర్ గ్లోరీలో చేర్పించారు.

గగన్ నారంగ్ శిక్షణలో మరింత రాటుదేలిన ఈ యువ షూటర్ వెనుదిరిగి చూసుకోలేదు. 2019 తెలంగాణ షూటింగ్ చాంపియన్ షిప్ లో 400కు 400 పాయింట్లు స్కోర్ చేసి రికార్డు సృష్టించాడు. గురువుకు తగ్గ శిష్యుడిగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వరుసగా పతకాలు గెలుస్తున్నాడు. ఇప్పటి వరకూ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 13 పతకాలు గెలిచాడు. 2021 డెఫ్లంఫిక్స్ లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ తో పాటు మిక్సిడ్ టీమ్ ఈవెంట్లోనూ స్వర్ణాలు గెలిచాడు. అప్పుడు కూడా స్కోరింగ్ లో ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. అలాగే 2023 జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లోనూ బంగారు పతకం గెలిచాడు. ఖర్చుతో కూడిన షూటింగ్ క్రీడలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా తల్లితండ్రుల ప్రోత్సాహంతో దూసుకెళుతున్నాడు.
ఇదిలా ఉంటే డెఫ్లంఫిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన ధనుష్ శ్రీకాంత్ (Dhanush Srikanth)కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ యువ షూటర్కు తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటీ 20 లక్షల రూపాయలు నగదు బహుమతిగా అందిస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు.ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.



