Dharmendra: ముగిసిన ఆరు దశాబ్దాల నట ప్రస్థానం..బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర కన్నుమూత
Dharmendra:1935, డిసెంబరు 8న పంజాబ్‌లోని నస్రలీ గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర, 1960లో 'దిల్ భీ తేరా హమ్ భీ తేరా' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
Dharmendra
భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న బాలీవుడ్ దిగ్గజం, ధర్మేంద్ర (Dharmendra), ఈరోజు కన్నుమూశారు. 89 ఏళ్ల వయసులో, వయోభారంతో కొన్ని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త యావత్ బాలీవుడ్ పరిశ్రమను, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.
ఇటీవలే కొన్ని రోజుల క్రితం ధర్మేంద్ర (Dharmendra)ఆరోగ్య సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అప్పట్లో ఆయన మరణించారని వచ్చిన తప్పుడు వార్తలపై ఆయన కూతురు ఇషా డియోల్ స్పందించి, తప్పుడు ప్రచారాలు చేయవద్దని వేడుకున్నారు. ఆ కొద్ది రోజుల విరామం తర్వాత, ఆయన తిరిగి కోలుకున్నారని అంతా సంతోషించారు. కానీ ఆమె అలా ప్రకటించిన కొద్దిరోజులకే, నేడు ఆయన మరణవార్త అభిమానులను షాక్ కలిగేలా చేసింది.
సాఫ్ట్ హీరో నుంచి ‘హీ-మ్యాన్’ వరకు.. 1935, డిసెంబరు 8న పంజాబ్‌లోని నస్రలీ గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర (Dharmendra), 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన నట ప్రస్థానంలో, తొలి నాళ్లలో సాఫ్ట్, రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
1970వ దశకంలో ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన పట్టు, బలమైన ఫిజిక్‌తో ‘హీ-మ్యాన్’ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ‘ఆంఖే’, ‘షికార్’, ‘మేరా గావ్ మేరా దేశ్’, ‘యాదోంకీ బారాత్’, ‘దోస్త్’, ‘ధరమ్ వీర్’ లాంటి సినిమాలతో స్టార్‌గా ఎదిగారు.

భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచిన ‘షోలే’ సినిమాలో అమితాబ్‌తో కలిసి ఆయన పోషించిన వీరూ పాత్ర, ధర్మేంద్ర (Dharmendra)కు ఎనలేని గుర్తింపును, ప్రేక్షకుల నీరాజనాన్ని తెచ్చిపెట్టింది.
నటన రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, ధర్మేంద్ర 1997లో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా, 2012లో భారత ప్రభుత్వం .. దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.
ధర్మేంద్ర రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగారు. 2004-09 మధ్యలో బిజేపీ నుంచి ఎంపీగా సేవలందించారు. చివరిగా, టెలివిజన్ రంగంలో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోకు జడ్జిగా వ్యవహరించి, ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ఆయన వారసత్వాన్ని కుమారులు సన్నీ డియోల్ , బాబీ డియోల్ ముందుకు తీసుకెళ్తున్నారు. భార్య హేమా మాలిని, కూతురు ఇషా డియోల్ కూడా సినీ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసుకున్నారు.
ప్రస్తుతం ఆయన నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించడానికి క్యూ కట్టారు.



