Bangladesh: ఉద్యమ నేత హత్య.. అట్టుడుకుతున్న బంగ్లాదేశ్
Bangladesh: సింగపూర్ విదేశాంగ శాఖ ఉస్మాన్ హాడీ మృతిని ధృవీకరించింది. క్షణాల్లో ఈ వార్త సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు
Bangladesh
బంగ్లాదేశ్(Bangladesh) లో మళ్లీ హింస మొదలైంది. ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనకు దిగారు. దీనికి కారణం బంగ్లాదేశ్(Bangladesh) విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ హాడీ హత్య…గత వారం గుర్తు తెలియని దుండగులు ఉస్మాన్ హాడీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఢాకాలో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితి కావడంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన సింగపూర్ కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సింగపూర్ విదేశాంగ శాఖ ఉస్మాన్ హాడీ మృతిని ధృవీకరించింది. క్షణాల్లో ఈ వార్త సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు కంపెనీ కార్యాలయాలపై దాడులకు దిగారు. ఫర్నిచర్ కు నిప్పంటించి, వాహనాలను ధ్వంసం చేశారు.
ఈ నిరసనలతో పలు ప్రాంతాల్లో తీవ్ర భయానక పరిస్థితి కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. క్రమంగా రాజకీయరంగు కూడా పులుముకున్న నిరసనలు మరింత హింసకు దారితీసాయి. నిరసనకారులు అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

అలాగే చిట్టగాంగ్ మాజీ మేయర్ మొహియుద్దీన్ ఇంటిని తగలబెట్టేశారు. ఢాకాలోని పలు మీడియా కార్యాలయాలపై సైతం దాడులకు దిగి నిప్పుపెట్టారు. భయాందోళనకు గురైన మీడియా సిబ్బందిని ఆర్మీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు.
ఇదిలా ఉంటే భారత్ హైకమీషన్ ఆఫీస్ ముందు పలువురు నిరసనకారులు నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. దీంతో బంగ్లాలో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. వీలుంటే స్వదేశానికి వచ్చేయాలని కోరింది. కాగా బంగ్లాదేశ్ (Bangladesh)ప్రస్తుతం పాకిస్థాన్ తో రహస్య స్నేహం పెంచుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే హత్యకు గురైన ఉస్మాన్ హాడీ గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఈ ఉద్యమంతోనే 15 ఏళ్ల షేక్ హసీనా పాలన ముగిసిపోయింది. ఇంక్విలాబ్ మంచా అనే విద్యార్థి సంఘానికి ఉస్మాన్ హాడీ నాయకత్వం వహించాడు. వచ్చే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానూ పోటీకి దిగాడు.
ఉస్మాన్ హాడీ భారత్ ను ద్వేషించేవాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. భారత్ భూభాగాలను కలుపుకుని గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో పలు మ్యాప్ లు తయారు చేసినట్టు గుర్తించారు. ఈ కారణంగానే పాక్ కూడా బంగ్లాకు దగ్గరయ్యేందుకు రహస్యంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.



