Religious:మత స్వేచ్ఛా? బలవంతపు మార్పిడా?.. హీట్ పెంచుతున్న సుప్రీంకోర్టు ప్రశ్న
Religious: మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా మోసపూరిత మతమార్పిడిని అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాయి.
Religious
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కూడా తనకిష్టమైన మతాన్ని స్వీక రించే, ఆచరించే , ప్రచారం చేసుకునే ప్రాథమిక హక్కును కల్పించింది. అయితే, ఇదే సమయంలో మతం(Religious) విషయంలో ఎవరినైనా భయపెట్టినా, మోసం చేసినా లేదా ఆశ చూపించి మతం మార్చినా అది చట్టవిరుద్ధం అవుతుంది.
ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా యాంటీ కన్వర్షన్ చట్టాల చర్చ నడుస్తోంది. ప్రస్తుతం మన దేశంలోని పది కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఈ చట్టాలు అమలులో ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల అయితే ఈ విషయంలో చాలా కఠినమైన నిబంధనలను పాటిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన చట్టం.. దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు చాలా సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసింది. మతం(Religious) మార్చుకోవడం అనేది ఒక వ్యక్తి యొక్క స్వచ్ఛంద నిర్ణయం అని, సరైన ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో ఎవరినీ అరెస్టు చేయకూడదంటూ కోర్టు స్పష్టం చేసింది.
అయితే, మరోవైపు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా మోసపూరిత మతమార్పిడిని అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాయి. ఇటీవలే కఠిన శిక్షలతో కూడిన బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం కూడా ప్రతిపాదించడంతో హక్కుల సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు ఈ చట్టాలు అడ్డుకట్ట వేస్తున్నాయని వాదిస్తున్నాయి.
కాగా ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలోకి చేరింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు 12 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఒక మౌలికమైన ప్రశ్నను లేవనెత్తింది. మతాన్ని ప్రచారం చేసుకోవడం రాజ్యాంగబద్ధమైన హక్కే కానీ, అవతలి వ్యక్తిని మతం మార్పించే హక్కు ఎవరికైనా ఉంటుందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే భవిష్యత్తులో ఈ చట్టాల గమనాన్ని నిర్ణయించబోతోంది. బలవంతపు మార్పిడులు జరిగితే చట్టం తన పని తాను చేయాలి కానీ, ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా చేసుకునే వివాహాలను కానీ మతం మార్పులను కానీ పోలీసులు అడ్డుకోవద్దని కోర్టులు భావిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే ఒక కీలక తీర్పునిచ్చింది. మతం మారిన తర్వాత వ్యక్తికి తన పాత మతానికి సంబంధించిన కుల ఆధారిత రిజర్వేషన్లు వర్తించవని క్లారిటీ ఇచ్చింది. ఇది ఒక కొత్త సామాజిక చర్చకు దారితీసింది. ఒకవైపు బలహీన వర్గాలను ప్రలోభాల నుంచి రక్షించడానికే ఈ చట్టాలు అని ప్రభుత్వాలు చెబుతుంటే, మరోవైపు ఇంటర్-ఫెయిత్ వివాహాలను టార్గెట్ చేస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
నిజానికి మతం సమస్య కాదు, ఆ మార్పిడి వెనుక ఉన్న బలవంతం కానీ మోసం కానీ మాత్రమేనని న్యాయనిపుణుల అభిప్రాయం. రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూ.. వ్యవస్థాగతమైన బలవంతపు మార్పిడులను ఎలా అరికట్టాలనేదే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాల్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు ..ఈ విషయంలో ఒక స్పష్టమైన మార్గదర్శకంగా నిలవనుందన్న వాదన వినిపిస్తోంది.
Vaibhav Suryavanshi : వైభవ్ కేరాఫ్ విధ్వంసం.. బౌలర్లకు నిద్ర లేని రాత్రులు




One Comment