Hijab controversy: హిజాబ్ మహిళా డాక్టర్ చుట్టూ పాలిటిక్స్.. రూ.3 లక్షల జీతంతో జాబ్ ఆఫర్
Hijab controversy: ప్రస్తుతం ప్రభుత్వ డాక్టర్ గా ఆమెకు రూ.32 వేల జీతం వస్తుండగా.. ఈ వివాదం తర్వాత పర్వీన్ బాగా ఫేమస్ అయిపోయారు. ఈ వివాదం ఆమెకు పాపులారిటీనే కాదు ఉద్యోగ అవకాశాలను సైతం తెచ్చిపెడుతోంది.
Hijab controversy
బిహార్ సీఎం నితీశ్ కుమార్ పలు వివాదాస్పద అంశాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నితీశ్ కు తాజాగా హిజాబ్ వివాదం (Hijab controversy)ఎంత రచ్చకు దారితీసిందో అందరికీ తెలుసు. ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసే కార్యక్రమంలో నితీశ్ ముస్లిం మహిళా డాక్టర్ నుస్రత్ పర్వీన్ హిజాబ్(Hijab controversy) ను లాగడం తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం బిహార్, జార్ఖండ్ తో పాటు పలు రాజకీయ పార్టీల పాలిటిక్స్ అన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వ డాక్టర్ గా ఆమెకు రూ.32 వేల జీతం వస్తుండగా.. ఈ వివాదం తర్వాత పర్వీన్ బాగా ఫేమస్ అయిపోయారు. ఈ వివాదం ఆమెకు పాపులారిటీనే కాదు ఉద్యోగ అవకాశాలను సైతం తెచ్చిపెడుతోంది. సదరు వివాదంలో పర్వీన్ ప్రమేయం లేకపోయినా రాజకీయపరంగా సొమ్ము చేసుకునేందుకు పలు పార్టీలు, పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం అయితే ఏకంగా భారీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. నెలకు రూ.3 లక్షల రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది.
అంతేకాదు ఆమె సౌలభ్యానికి తగ్గట్టు పలు సౌకర్యాలు కూడా కల్పించేందుకు సిద్ధమైంది. పర్వీన్ కు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇస్తామని జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ ప్రకటించారు. ప్రభుత్వ వసతితో పాటు భద్రత కూడా కల్పిస్తామని తెలిపారు. దీనిపై ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పర్వీన్ డైలమా పరిస్థితిలో ఉన్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

సీఎం నితీశ్ ఇచ్చిన నియామక పత్రం ప్రకారం శనివారం సాయంత్రం లోపు ఆమె విధుల్లో చేరాల్సి ఉంది. ముందు మెడికల్ పరీక్షలు చేయించుకోవడంతో పాటు ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ కు కూడా హాజరు కావాల్సి ఉండగా.. ఆమె ఇంకా వెళ్లలేదని సమాచారం. స్థానిక సివిల్ సర్జన్ సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు.
నియమాక పత్రం అందిస్తుండగా ఫోటో కోసం ఆమె ధరించిన హిజాబ్ (Hijab controversy)ను నితీశ్ లాగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషలో మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ముస్లిం మహిళను నితీశ్ అవమానించారంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఎస్పీ అధినేత మాయావతితో పాటు పలువురు మహిళా నేతలు, రాజకీయ నాయకులు నితీశ్ చర్యను తప్పుపట్టారు. అయితే నితీశ్ మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు.



