Dhanurmasam:సంక్రాంతికి ముందు వచ్చే ధనుర్మాసం విశిష్టత తెలుసా? ఈ సమయంలో ఎవరిని పూజించాలి?
Dhanurmasam: గోదాదేవి కళ్యాణాన్ని చూసిన వారికి లేదా జరిపించిన వారికి వివాహ గడియలు కుదురుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
Dhanurmasam
తెలుగు వారికి సంక్రాంతి పండుగ అంటేనే ఒక పెద్ద వేడుకగా లెక్క. ఈ పండుగకు ముందు వచ్చే నెల రోజులను ధనుర్మాసం (Dhanurmasam)అంటారు. ఈ మాసంలో సూర్యుడు ధనూ రాశిలో ప్రవేశిస్తాడు. ఈ సమయం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది.
ముఖ్యంగా విష్ణుమూర్తిని ఆరాధించే వారికి ధనుర్మాసం(Dhanurmasam) ఎంతో ప్రీతిపాత్రమైనది. ధనుర్మాసం అనగానే హిందువులకు గుర్తొచ్చేది గోదాదేవి (ఆండాళ్ తల్లి). ఆమె రంగనాథుడిని తన భర్తగా పొందాలని నిశ్చయించుకుని, ముప్పై రోజుల పాటు తిరుప్పావై పాశురాలను పఠించి, భక్తితో స్వామిని కొలిచిందట. ఈ సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పటికీ వైష్ణవాలయాల్లో ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై పఠిస్తారు.

ఈ నెల రోజులు ఉదయాన్నే లేచి ఇళ్ల ముందు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెడతారు. ఇలా పూజించడం వెనుక పెద్ద పరమార్థం ఉందట. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ప్రకృతిని , పశుసంపదను గౌరవించే విధానంగా పెద్దలు చెబుతారు.
ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుందట. ధనుర్మాసం చివరిలో వచ్చే భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని చూసిన వారికి లేదా జరిపించిన వారికి వివాహ గడియలు కుదురుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ముక్కోటి ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. ఆ సమయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.అందుకే ఆరోజు భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడతాయి.
ఈ మాసంలో భక్తితో పాటు ఆరోగ్య నియమాలు కూడా కలిసి ఉంటాయి. ఉదయాన్నే చలిలో లేచి శుచిగా స్నానం చేయడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. ఈ ధనుర్మాస దీక్ష మనలో క్రమశిక్షణను , దైవచింతనను నింపుతుంది.




One Comment