Census: దేశంలో తొలిసారి డిజిటల్ జనాభా లెక్కలు..ఆరోజు నుంచే స్టార్ట్..
Census: కేంద్ర ప్రభుత్వం దీనిని ఈసారి కేవలం జనాభా లెక్కల సేకరణగా మాత్రమే కాకుండా, ఒక భారీ డిజిటల్ విప్లవంలా నిర్వహించబోతోంది.
Census
16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనగణన (Census) ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. 2021లో జరగాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ మహమ్మారి వల్ వాయిదా పడి.. ఇప్పటి వరకూ రకరకాల కారణాలతో వాయితా పడుతూ వస్తోంది.
అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం దీనిని కేవలం జనాభా లెక్కల సేకరణగా మాత్రమే కాకుండా, ఒక భారీ డిజిటల్ విప్లవంలా నిర్వహించబోతోంది. దీనికోసం కేంద్ర హోంశాఖ జనవరి 7న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో, మొబైల్ యాప్‌ల ద్వారా జరగనుంది.
ఈ జనగణన(Census)ను ప్రభుత్వం రెండు ప్రధాన దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది.
తొలి దశ (ఏప్రిల్ 1 – సెప్టెంబర్ 30, 2026).. దీనిని హౌస్ లిస్టింగ్ లేదా గృహ గణన అంటారు. ఈ దశలో దేశంలోని ప్రతి ఇంటినీ వెళ్లి, ఇళ్ల వివరాలను సేకరిస్తారు. ప్రతి రాష్ట్రానికి ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 30 రోజుల సమయం కేటాయించారు.

రెండో దశ (ఫిబ్రవరి – మార్చి 1, 2027).. ఇది అసలైన జనాభా లెక్కల సేకరణ. దీనిలో మనుషుల సంఖ్య, ఇతర వివరాలను సేకరిస్తారు. అయితే జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రక్రియను 2026 సెప్టెంబర్ నుంచే మొదలుపెడతారు.
ఇంతకు ముందులా కాగితం, పెన్ను పట్టుకుని ఇంటింటికి రావడం కాకుండా.. ఈసారి 30 లక్షల మంది గణకులు తమ మొబైల్ ఫోన్లు లేదా ట్యాబ్ల ద్వారా వివరాలను నమోదు చేస్తారు.
అంతేకాదు, ప్రజలు కూడా తమంతట తాముగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (Self Enumeration) సౌకర్యాన్ని కూడా కల్పించారు.
దీనివల్ల డేటా చాలా వేగంగా సేకరించడంతో పాటు కచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఈసారి జనాభా లెక్కలతో పాటే ‘కుల గణన’ను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1931 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని కులాల వివరాలను సేకరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.



