Parliament : రేపటి నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి.

Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు నెల రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు, దేశంలో నెలకొన్న కీలక పరిణామాల మధ్య వాడీవేడిగా సాగే అవకాశాలున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, కీలకమైన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఉభయ సభలు తొలిసారిగా సమావేశమవుతున్నాయి. ఈ పరిణామాలు సమావేశాల ప్రారంభానికి ముందే ఉద్రిక్తతను పెంచాయి.
Parliament
సమావేశాలకు ముందు, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు కీలక చర్చలు జరిపారు. సోమవారం నుంచి పార్లమెంట్ ( Parliament )లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశానికి 10 పార్టీల నేతలు హాజరయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి వాస్తవాలు వెల్లడించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ‘ఇండియా’ కూటమి నిర్ణయించింది. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, దేశ విదేశాంగ విధానంపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్ష నేతలు వెల్లడించారు.
‘ఆపరేషన్ సిందూర్’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. తాను అనేక యుద్ధాలను ఆపానని, లేదంటే రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగేదని ట్రంప్ (Trump) ప్రకటించుకున్నారు. యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను నిలదీస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi), ట్రంప్ మాటలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ అంటున్నారని, దీనిపై దేశ ప్రజలు స్పష్టత కోరుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అయితే, ‘ఇండియా’ కూటమి సమావేశానికి ఆప్ ఎంపీలు హాజరుకాలేదు. ‘ఇండియా’ కూటమితో తమకు సంబంధం లేదని, పార్లమెంట్ వరకే తమకు పొత్తు ఉందని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఏడు పెండింగ్ బిల్లులను కూడా చర్చకు తీసుకురానుంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్ జియో రెలిక్స్ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ (సవరణ) బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ‘ఇన్‌కం ట్యాక్స్-2025 బిల్లు’ను కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. విపక్షం లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామని కేంద్రమంత్రులు స్పష్టం చేస్తున్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాలలోనే పార్లమెంటు ముందుకు రానుంది. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.