Just SportsLatest News

Team India : క్యాచ్‌లు చేజారిపోతున్నాయ్..మెగాటోర్నీలో భారత్ చెత్త ఫీల్డింగ్

Team India : క్రికెట్‌లో ఏ ఒక్క విభాగంలోనో అదరగొడితే విజయాలు రావు.. బ్యాటింగ్ , బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ దుమ్మురేపాల్సిందే. మరీ ముఖ్యంగా మ్యాచ్ లు గెలిపించేవి క్యాచ్ లే.. 2024 ప్రపంచకప్ ఫైనలే దీనికి ఉదాహరణ

Team India

క్రికెట్ లో ఏ ఒక్క విభాగంలోనో అదరగొడితే విజయాలు రావు.. బ్యాటింగ్ , బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ దుమ్మురేపాల్సిందే. మరీ ముఖ్యంగా మ్యాచ్ లు గెలిపించేవి క్యాచ్ లే.. 2024 ప్రపంచకప్ ఫైనలే దీనికి ఉదాహరణ… సూర్యకుమార్ అందుకున్నది క్యాచ్ కాదు వరల్డ్ కప్ అన్నది అందరికీ తెలుసు. అందుకే క్యాచ్ లు జారివిడిస్తే మ్యాచ్ చేజారినట్టే. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో టీమిండియా(Team India) మాత్రం ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది.

ఇంకో మాటలో చెప్పాలంటే  ఫీల్డింగ్ పరమ చెత్తగా ఉంది. వెస్టిండీస్ తో మ్యాచ్ లో ఇది స్పష్టంగా కనిపించింది. పలు క్యాచ్ లు వదిలేయడం విండీస్ భారీస్కోరు చేసేందుకు దోహదపడింది. బ్యాటింగ్ లో సంజూ శాంసన్ చివరి వరకూ క్రీజులో నిలదొక్కుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ విండీస్ పై భారత్(Team India) ఓడిపోయి ఉంటే కచ్చితంగా అది ఫీల్డింగ్ తప్పిదాలే కారణంగా చెప్పేవారు.

ఎందుకంటే నాలుగు కీలక క్యాచ్ లు వదిలేశారు. ఈ మ్యాచ్ మాత్రమే కాదు ఓవరాల్ గా ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో భారత్(Team India) ఫీల్డింగ్ అత్యంత పేలవంగా ఉంది. క్యాచ్ లు అందుకునే అంశంలో సూపర్ 8 స్టేజ్ కు సంబంధించి చివరి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉండగా.. జింబాబ్వే రెండో స్థానంలోనూ, విండీస్, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లోనూ కొనసాగుతున్నాయి.

మనకంటే పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక కూడా మెరుగ్గానే క్యాచ్ లు అందుకుంటున్నాయంటే భారత్ ఫీల్డింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఇప్పటిదాకా భారత జట్టు, 7 మ్యాచుల్లో 13 క్యాచులు వదిలేసింది. సూపర్ 8 వరకూ వచ్చిన ఏ టీమ్ కూడా ఇన్ని క్యాచులు డ్రాప్ చేయలేదు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా వంటి ఫీల్డర్లు కూడా క్యాచులు అందుకోలేకపోతున్నారు.రిస్కీ క్యాచులను అందుకునే ప్రయత్నంలో జారవిడిచారంటే పర్వాలేదు. కానీ చేతుల్లోకి వచ్చిన క్యాచులను కూడా భారత ఫీల్డర్లు అందుకోలేకపోతున్నారు.

Team India
Team India

వెస్టిండీస్ 195 పరుగుల భారీస్కోరు చేసిందంటే దానికి పరోక్షంగా భారత ఫీల్డర్లు కూడా కారణమయ్యారు. క్యాచ్ లు వదిలేయడంతోనే బతికిపోయిన హోప్ , ఛేజ్ , హోల్డర్ మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది కాబట్టి దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే ఇంగ్లాండ్ తో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు కచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిన అంశం ఫీల్డింగే.. ముఖ్యంగా క్యాచ్ లు అందుకోవడంపై ఇంకా దృష్టిసారించాలి.

ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఇంకొక అవకాశం మన ఫీల్డింగ్ ద్వారా వచ్చిందంటే వారిని అడ్డుకోవడం కష్టం. ఇదిలా ఉంటే బ్యాటింగ్ లో నిలకడలేమి కూడా వెంటాడుతోంది. ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు తడబడుతున్నారు. అటు బౌలింగ్ కూడా ఇంకా పూర్తిస్థాయిలో గాడినపడలేదు. సెమీఫైనల్ కు ఇంకా మూడురోజుల సమయం మిగిలి ఉండటంతో  వీటిపై దృష్టి పెడితే ఇంగ్లాండ్ కు చెక్ పెట్టి ఫైనల్ కు చేరడం పెద్ద కష్టమేమీ కాదు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button